– మామ అరెస్ట్ తో స్పీడ్ పెంచిన బ్రాహ్మణి- రేపుమాపో లోకేష్ అరెస్ట్ అంటూ ప్రచారం
– నెక్స్ట్ అంతా బ్రాహ్మణి కనుసన్నల్లోనేనా?
– ఓవైపు చంద్రబాబు అరెస్ట్ పై నిరసనలు
– ఇంకోవైపు పొలిటికల్ కామెంట్లు
– ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినట్టేనా?
టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ను స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్ట్ చేసింది సీఐడీ (CID). రేపోమాపో ఆయన తనయుడు లోకేష్ (Lokesh) కూడా వేరే కేసులో అరెస్ట్ ఖాయమనే ప్రచారం సాగుతోంది. అదే గనుక జరిగితే.. టీడీపీ (TDP) సంగతేంటి..? బాలకృష్ణ (Balakrishna) అంతా చూసుకుంటారా? ఆయనకు అంత స్టామినా ఉందా? లేక, చంద్రబాబు సతీమణి భువనేశ్వరి (Bhuvaneswari) నడిపిస్తారా? ఇలా అనేక డౌట్స్ తెరపైకి రాగా.. వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ అందరి దృష్టి తనపై పడేలా చేసుకుంటున్నారు లోకేష్ భార్య నారా బ్రాహ్మణి (Brahmani). దీంతో టీడీపీ భవిష్యత్ ఈమె చేతుల్లోనే అనే ప్రచారం ఊపందుకుంది.
బ్రాహ్మణి.. ప్రస్తుతం హెరిటేజ్ (Heritage) సంస్థను ముందుండి నడిపిస్తున్నారు. మంచి వ్యాపారవేత్తగా గుడ్ విల్ ఉంది. ఈమె ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ అంతా రాజకీయాలకు సంబంధించిందే అయినా.. ఏనాడూ ఆ విషయాల్లో ఆమె కలగజేసుకున్నది లేదు. అయితే.. చంద్రబాబు అరెస్ట్ తర్వాత సీన్ మారిపోయింది. తన మామ కోసం అరెస్ట్ ను ఖండిస్తూ.. టీడీపీ శ్రేణులతో కలిసి ధర్నాల్లో పాల్గొంటున్నారు. బాబుకు మద్దతునిచ్చిన వారిని కలిసి మాట్లాడుతున్నారు. కుటుంబసభ్యురాలిగా తన వంతు పాత్ర పోషిస్తున్నారని అంతా అనుకున్నా.. ఈమధ్య ట్విట్టర్(ఎక్స్)లో అంగన్వాడీల గురించి ఆమె పెట్టిన పోస్ట్ రాజకీయంగానే ఉంది. దీనికితోడు, గత మూడేళ్ల నుంచి యాక్టివ్ గా లేని ట్విట్టర్(ఎక్స్)ను తెగ వాడేస్తున్నారు. ఏపీ సీఎం జగన్ (CM Jagan) ను డైరెక్ట్ గానే టార్గెట్ చేస్తున్నారు.
ఏపీ (Andhra) లో పరిశ్రమలకు సంబంధించి తాజాగా జగన్ ను లక్ష్యంగా చేసుకుని బ్రాహ్మణి ట్వీట్ చేశారు. ‘‘ఇతర రాష్ట్రాల అభివృద్ధి అజెండాగా ఏపీ ప్రభుత్వం ఎందుకు పనిచేస్తోంది. సులభతర వాణిజ్యం, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ను అగ్రస్థానంలో నిలిపి అందరూ గర్వపడేలా చేశారు. జగన్ పాలనలో అమరరాజా నుంచి లులు వరకూ ఎన్నో పరిశ్రమలు ఏపీ నుంచి తెలంగాణకు తరలిపోయాయి. ప్రస్తుతం చాలా పరిశ్రమలు రాష్ట్రం విడిచి వెళ్తున్నాయి’’ అని విమర్శల దాడి చేశారు. ఈ ట్వీట్ అటు టీడీపీ శ్రేణులకు, ఇటు రాజకీయ వర్గాలకు బ్రాహ్మణి రాజకీయ భవిష్యత్తుపై ఓ క్లారిటీ ఇచ్చేసిందనే వార్తలు వస్తున్నాయి.
బ్రాహ్మణి డైరెక్ట్ పాలిటిక్స్ లోకి దిగిపోయారని.. పార్టీకి ఆమె పెద్ద ఎసెట్ అవుతారని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు. పైగా, ఎలాంటి తడబాటు లేకుండా మీడియా ముందు ఆమె మాట్లాడుతున్న తీరు చూసి ఎన్టీఆర్ వారసురాలిగా పార్టీ కార్యక్రమాల్లో తరచూ పాల్గొంటే మరింత రాటుదేలుతారని అనుకుంటున్నారు. నిజానికి, బ్రాహ్మణి పొలిటికల్ ఎంట్రీపై ఎప్పటినుంచో చర్చ జరుగుతోంది. ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని.. పార్టీలో లీడ్ రోల్ ప్లే చేయాలని చాలా సందర్భాల్లో చర్చకు వచ్చింది. కానీ, అది సాధ్యం కాలేదు. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ క్యాడర్ బలంగా నిలబడాలంటే.. బ్రాహ్మణి వల్లే అవుతుందనే టాక్ పార్టీలో గట్టిగా వినిపిస్తోంది.