అమరావతి (Amaravthi) ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుపై సీఐడీ (CID) విచారణ కొనసాగుతోంది. మాజీ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ను రెండోరోజు కూడా విచారిస్తోంది. ఉదయం 10 గంటలకు ఆయన తాడేపల్లిలోని సీఐడీ కార్యాలయానికి చేరుకున్నారు. తొలిరోజు పలు ప్రశ్నలు వేసిన అధికారులు.. లోకేష్ నుంచి సమాచారం సేకరించారు. విచారణ పూర్తయిన తర్వాత 41ఏ నోటీసులు ఇచ్చి ఇవాళ కూడా రమ్మని చెప్పారు.
తొలిరోజు 50 ప్రశ్నలు సంధించిన సీఐడీ.. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ విషయంలో హెరిటేజ్ సంస్థలకు లోకేష్ లబ్ధి చేకూరేలా వ్యవహరిచారని ఆరోపిస్తోంది. ఈ కోణంలోనే విచారణ కొనసాగిస్తోంది. హెరిటేజ్, లింగమనేని భూముల కోసం ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చాలని సీఆర్డీఏపై ఒత్తిడి తెచ్చారనే విషయాలపై ప్రశ్నిస్తోంది. అయితే, లోకేష్ తొలిరోజు విచారణకు సహకరించలేదని సీఐడీ వర్గాలు చెబుతుంటే.. ఆయన మాత్రం తనకు తెలిసింది మొత్తం చెప్పానని అంటున్నారు.
ఇన్నర్ రింగ్ రోడ్డుతో సంబంధం లేని ఎన్నో ప్రశ్నలు తనను అడిగారని చెబుతున్నారు లోకేష్. హెరిటేజ్ గురించే ఎక్కువ ఆడిగిందని తెలిపారు. మిగిలిన ప్రశ్నలకు కూడా తొలిరోజే సమాధానం చెప్తానన్నా కూడా సీఐడీ అంగీకరించలేదన్నారు. తన అంగీకారంతోనే 5 గంటల తర్వాత కూడా విచారణ కొనసాగించామని కోర్టుకు తెలియజేయొచ్చు కదా అని కోరితే.. ప్రశ్నలు తయారు చేసుకోవాల్సి ఉన్నందున రెండోరోజు కూడా విచారణకు రావాలని చెప్పినట్టు తెలిపారు.
న్యాయవాది గింజుపల్లి సుబ్బారావుతో కలిసి రెండోరోజు సీఐడీ విచారణకు హాజరయ్యారు లోకేష్. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ విచారణ కొనసాగుతుంది.