– స్కూల్ లో పెచ్చులూడిన పైకప్పు
– ఇద్దరు విద్యార్థులకు గాయాలు
– తీవ్ర రక్తస్రావం.. ఆస్పత్రికి తరలింపు
– నర్సంపేట స్కూల్లో ఘటన
– భయంభయంగా విద్యార్థులు
మన ఊరు – మన బడి పథకంతో విద్యా రంగంలో నవశకం మొదలైందని బీఆర్ఎస్ నేతలు చెబుతుంటారు. ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను మార్చేస్తున్నామని.. సీఎం కేసీఆర్ సూపర్ అంటూ తరచూ తెగ పొగిడేస్తుంటారు. కానీ, స్కూళ్ల అభివృద్ధిపై సరైన క్లారిటీ లేదనే విమర్శలు ఉన్నాయి. చాలా పాఠశాలల్లో కనీస వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉందని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. తాజాగా వరంగల్ జిల్లాలో జరిగిన ఘటనను ఉదహరిస్తూ.. సర్కారు బడులపై కేసీఆర్ చిత్తశుద్ది ఏంటో అర్థం అవుతోందని మండిపడుతున్నాయి.
నర్సంపేట పట్టణంలోని జిల్లా పరిషత్ సెకండరీ స్కూల్ లో బుధవారం పెచ్చులూడిపడి ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు. బుధవారం యథావిధిగా పాఠశాల ప్రారంభం కాగా.. విద్యార్థులు అందరూ క్లాస్ రూంలోకి వెళ్లి చదువుకుంటున్నారు. మధ్యాహ్న సమయంలో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థులు ఇద్దరు బయటకు వచ్చారు. సరిగ్గా అదే సమయంలో క్లాస్ రూం ముందు ఉన్న స్లాబ్ పెచ్చులు ఉడి ఒక్కసారిగా వారిపై పడ్డాయి.
ఇద్దరు విద్యార్థుల తలకు గాయాలయ్యాయి. రక్తస్రావంతో ఉన్న వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో పాఠశాలలో ఎప్పుడు ఏ పెచ్చు ఊడి వారిపై పడుతుందో అని విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు.