Telugu News » Navaratri Brahmotsavalu: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు వెళ్తున్నారా…షెడ్యూల్ చూసుకోండి !

Navaratri Brahmotsavalu: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు వెళ్తున్నారా…షెడ్యూల్ చూసుకోండి !

అక్టోబర్ 15 ఆదివారం రాత్రి పెద్ద శేష వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. అప్పటి నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి.

by Prasanna
Brahmosthavalu

తిరుమల (Tirumala) శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు (Navarathri Brahmosthavalu) ఏర్పాట్లు సాగుతున్నాయి. ఇప్పటికే తిరుమలలో సెప్టెంబ‌రు 18 నుంచి 26 వ‌రకు సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాలు ముగియగా, దసరా పండుగకు నవరాత్రి ఉత్సవాలు జరుగనున్నాయి. సాధారణంగా ఏడాది ఒకసారి మాత్రమే బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. కానీ చాంద్రమానం ప్రకారం ప్రతి మూడు ఏళ్లకు ఒకసారి అధిక మాసం వస్తూ ఉంటుంది. ఇలా వచ్చినప్పుడు కన్యామాసం (భాద్రపదం) లో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు, దసర నవరాత్రుల్లో (ఆశ్వయుజం) నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. నవరాత్రి బ్రహోత్సవాలు అక్టోబరు 15 నుంచి 23వ తేదీ వరకు జరగనున్నాయని టీటీడీ (TTD) షెడ్యూల్ విడుదల చేసింది.

Brahmosthavalu

అక్టోబర్ 15 ఆదివారం రాత్రి పెద్ద శేష వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. అప్పటి నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి. 16వ తేదీ సోమవారం ఉదయం చిన్న శేష వాహనం, రాత్రి హంస వాహనంపై స్వామివారు విహరిస్తారు. 17 తేదీ మంగళవారం ఉదయం సింహ వాహనం, రాత్రి ముత్యపు పందిరి వాహన సేవలు జరుగుతాయి. 18వ తేదీ బుధవారం ఉదయం 8 నుంచి 10 వరకు కల్ప వృక్ష వాహనం, రాత్రి 7 నుంచి 9 వరకు సర్వ భూపాల వాహనంపై స్వామి వారు భక్తులను కరుణిస్తారు.

అక్టోబర్ 19వ తేదీ గురువారం ఉదయం మోహినీ అవతారం, రాత్రి గరుడ వాహన సేవ జరుగుతుంది. అక్టోబర్ 20వ తేదీ శుక్రవారం ఉదయం 8 నుంచి 10 వరకు హనుమద్ వాహనం, సాయంత్రం పుష్పక విమానం, రాత్రి గజ వాహనంపై శ్రీవారు విహరిస్తారు. 21 శనివారం రోజున ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహన సేవలు ఉంటాయి. 22వ తేదీ ఆదివారం ఉదయం స్వర్ణ రథోత్సవం, రాత్రి అశ్వ వాహనంపై స్వామివారు విహరిస్తారు. 23వ తేదీ సోమవారం తొమ్మిదో రోజు స్వామివారికి చక్ర స్నానం నిర్వహిస్తారు. దీంతో నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా అక్టోబరు 15 నుంచి 23 వరకు పలు సేవలను టీటీడీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అష్టదళ పాదపద్మారాధన, తిరుప్పావడ, కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, సహస్ర దీపాలంకార సేవలను రద్దు చేసినట్లు తెలిపింది. ముందస్తుగా ఆర్జిత బ్రహ్మోత్సవం సేవా టికెట్లు బుక్‌ చేసుకున్న భక్తులను నిర్దేశిత వాహన సేవకు అనుమతిస్తారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల అంకురార్పణ కారణంగా అక్టోబరు 14న సహస్ర దీపాలంకార సేవను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.

తిరుమల బ్రహ్మోత్సవాలకు ఇప్పటిను ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ సిబ్బంది శ్రీవారి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

You may also like

Leave a Comment