ఉత్తరాఖండ్ (Uttarakhand) లో టెన్నెల్ (Tunnel) కూలడంతో 41 మంది కార్మికులు అందులో చిక్కుకు పోయారు. వారిని రక్షించేందుకు గత పది రోజులుగా అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీకి ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ కాల్ చేశారు. రెస్క్యూ ఆపరేషన్ గురించి సీఎంను ఆయన ఆరా తీశారు.
ఈ మేరకు విషయాన్ని సీఎం కార్యాలయం వెల్లడించింది. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్న విధానం గురించి సీఎంను అడిగి ప్రధాని తెలుసుకున్నారని చెప్పింది. సహాయక చర్యల కోసం కావాల్సిన అత్యవసరమైన యంత్రాలు, వనరులను కేంద్రం అందిస్తోందని ఈ సందర్బంగా ప్రధాని చెప్పారని తెలిపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయంతో కార్మికులను సురక్షితంగా టన్నెల్ నుంచి బయటకు తీసుకు వస్తామని ప్రధాని మోడీ భరోసా ఇచ్చారని పేర్కొంది.
కార్మికులు మనోధైర్యంతో ఉండాలని ప్రధాని మోడీ సూచించారని ప్రకటనలో వివరించింది. ఈ నెల 12న ఉత్తర కాశీలో నిర్మాణంలో ఉన్న టన్నెల్ కూలి పోయింది. ఆ సమయంలో 41 మంది కార్మికులు ఆ సొరంగంలో చిక్కుకు పోయారు. సమాచారం అందుకున్న అధికారులు అక్కడకు చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. ఆ తర్వాత టన్నెల్ మరోసారి కూలడం, భారీగా కొండ చరియలు, రాళ్లు పడటంతో సహాయక చర్యలు ఆలస్యం అవుతోంది.
టన్నెల్ లోని కార్మికులకు ఓ పైపు ద్వారా ఆహార పదార్థాలు, తాగునీటిని, ఆక్సిజన్ ను పంపిస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ కోసం విదేశాల నుంచి ప్రత్యేకమైన డ్రిల్లింగ్ మిషన్లు కూడా తెప్పిచారు. తాజాగా కార్మికులను రక్షించేందుకు ఐదు ప్రణాళికలు రచించినట్టు అధికారులు తెలిపారు. ఈ కార్యాచరణ ప్రణాళికలను ఐదు ఏజెన్సీలు అమలు చేస్తాయని పేర్కొన్నారు.