వీర వనిత నీరా ఆర్య (Veer Neera Arya)….గొప్ప దేశ భక్తురాలు. సుభాష్ చంద్రబోస్ (Subash Chandra Bose) స్థాపించిన ఆజాద్ హిందు ఫౌజ్‌లో చేరి బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసిన వీర నారీ మణి. బ్రిటీష్ వారి కదలికలను ఎప్పటికప్పుడు నేతాజీకి చేరవేసిన దేశ మొదటి మహిళా గూఢచారి . నేతాజీ సుభాష్ చంద్రబోస్ కోసం చివరకు తన భర్తను హత్య చేసిన గొప్ప వ్యక్తి ఆమె.
1902 మార్చి 5న యూపీలోని ఖేక్రా నగర్‌లో సంపన్న కుటుంబంలో నీరా ఆర్య జన్మించారు. చిన్న తనం నుంచే జాతీయ వాద భావాలను అలవర్చుకున్నారు. బ్రిటీష్ ప్రభుత్వంలో సీఐడీ విభాగంలో పనిచేస్తున్న శ్రీకాంత్ జయ రంజన్ అనే వ్యక్తితో ఆమెకు వివాహం జరిగింది. తన భర్త ఎంతో మంది సాతంత్ర సమరయోధులను పట్టుకున్నారని తెలిసి ఆమె ఆందోళన చెందారు.
తాను జాతీయవాదినని, తన భర్త మాత్రం దేశ భక్తులను పట్టుకుంటున్నారని ఆలోచించారు. అందువల్ల తమ దారులు వేరని, ఆయనతో కలిసి ఉండలేనని తేల్చి చెప్పింది. భర్తకు దూరంగా వెళ్లి పోయి సింగపూర్ కు చేరుకుంది. అక్కడ అజాద్ హిందూ ఫౌజ్‌లో సభ్యురాలిగా చేరింది. కెప్టెన్ లక్ష్మీ సెహగల్ తో కలిసి సైనిక శిక్షణను ఆమె పూర్తి చేసుకున్నారు. ఝాన్సీ రెజిమెంట్ లో కీలక సభ్యురాలిగా పని చేశారు.
ఒక రోజు నేతాజీ శిబిరంలో ఆమె రక్షణ బాధ్యతను నిర్వహించారు. ఆ సమయంలో నేతాజీని చంపేందుకు జై రంజన్ అక్కడికి చేరుకున్నారు. అప్పటికే నేతాజీ డ్రైవర్ నిజాముద్దీన్ ను జై రంజన్ కాల్చి చంపాడు. అదే క్రమంలో నేతాజీపై కాల్పులు జరిపాడు. కానీ నేతాజీ చాకచక్యంగా తప్పించుకున్నారు. దీంతో అక్కడే ఉన్న నీరా తన భర్త జై రంజన్ ను తుపాకీతో కాల్చి చంపింది.
ఈ కేసులో ఆమె అరెస్టు చేసి కాలాపానీ జైళుకు తరలించారు. అక్కడ ఆమెను బ్రిటీష్ అధికారులు చిత్ర హింసలు పెట్టారు. అక్కడ నుంచి మరో ఇద్దరు సహచరులతో కలిసి నీరా తప్పించుకుంది. ఈ విషయాలను తన ఆటోబయోగ్రఫీ ‘మేరా జీవన్ సంఘర్ష్’లో వివరించారు. తన జీవిత చివరి దశలో హైదరాబాద్ లో పూలు అమ్ముకుంటూ సాధారణ జీవతం గడిపారు.