Telugu News » neeraj chopra: చరిత్ర సృష్టించిన నీరజ్‌ చోప్రా!

neeraj chopra: చరిత్ర సృష్టించిన నీరజ్‌ చోప్రా!

ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో పసిడి పతకం సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు.

by Sai

భారత అమ్ములపొదిలోకి మరో బంగారు పతకం వచ్చి చేరింది. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌ షిప్‌ (world athletics championships 2023) లో భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా (neeraj chopra) అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఆదివారం నాడు హంగేరీ రాజధాని బుడాపెస్ట్ లో జరుగుతున్న మెగా టోర్నీలో బరిసెను నీరజ్‌ 88.17 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానంలో నిలిచాడు. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో పసిడి పతకం సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు.

neeraj chopra wins historic world atletics championships gold with incredible

క్వాలిఫయింగ్‌ రౌండ్‌లో మొదటి ప్రయత్నంలోనే నీరజ్‌ బరిసెను 88.77 మీటర్ల దూరం విసిరి ఫైనల్‌ కు చేరడమే కాకుండా వచ్చే ఏడాది పారిస్‌ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్‌ కు అర్హత కూడా సాధించాడు. గతేడాది ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో రజతం నెగ్గిన నీరజ్‌ ఈసారి పసిడి ముద్దాడాడు.

భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన నీరజ్‌ తొలి ప్రయత్నంలో ఫౌల్‌ చేయగా.. రెండో ప్రయత్నంలో బరిసెను 88.17 మీటర్ల దూరం విసిరి టాప్‌కు దూసుకెళ్లాడు. పాకిస్థాన్‌కు చెందిన అర్షద్‌ నదీమ్‌ రజతం, వాడ్లెచ్‌ కాంస్యం దక్కించుకున్నారు. మూడో ప్రయత్నంలో నీరజ్‌ 86.32 మీటర్ల దూరం నమోదు చేసుకోగా.. అర్షద్‌ మూడో ప్రయత్నంలో బరిసెను 87.82 మీటర్ల దూరం విసిరి రెండో స్థానానికి దూసుకొచ్చాడు.

మరో భారత త్రోయర్‌ డీపీ మను మూడో ప్రయత్నంలో 83.72 మీటర్ల దూరం నమోదు చేసుకున్నాడు. కిషోర్‌ జెనా రెండో ప్రయత్నంలో బరిసెను 82.82 మీటర్ల దూరం విసిరాడు. రెండో ప్రయత్నంలోనే అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన నీరజ్‌ నాలుగోసారి 84.64, ఐదోసారి 87.73 మీటర్లకు పరిమితమయ్యాడు.

రెండో రౌండ్‌ నుంచి టాప్‌లో నిలిచిన నీరజ్‌ను చివరి వరకు మరే త్రోయర్‌ అధిగమించలేకపోయాడు. దీంతో భారత అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో నయా శకానికి నీరజ్‌ నాంది పలికాడు.

You may also like

Leave a Comment