ఆన్ లైన్ పోర్టల్ ‘న్యూస్ క్లిక్’ (News Click)వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా ఈ కేసులో అమెరికాకు చెందిన మిలియనీర్ నెవెల్లి రాయ్ సింఘా ( Neville Roy Singham) నికి ఈడీ సమన్లు పంపింది. ‘న్యూస్ క్లిక్’కేసులో మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఈడీ ఈ నోటీసులు పంపింది. షాంఘైకి చెందిన నెవెల్లి రాయ్‌కు భారత విదేశాంగ శాఖ ద్వారా నోటీసులు పంపినట్టు సమాచారం.
ఈ విషయంలో చైనా న్యాయస్థానాల సహాయం కోరుతూ ఇటీవల ఢిల్లీ న్యాయస్థానం లేఖను రాసిన తర్వాత ఈ సమన్లు పంపే ప్రక్రియ ప్రారంభం అయినట్టు ఈడీ వర్గాలు వెల్లడించాయి. భారత్‌లో చైనా అనుకూల సమాచారాన్ని ప్రసారం చేసేందుకు ‘న్యూస్ క్లిక్’సంస్థకు భారీగా నిధులు ముట్టాయంటూ ఆరోపణలు వచ్చాయి.
ఈ విషయంలో చైనా ప్రభుత్వంతో కలిసి నెవెల్లి రాయ్ పని చేశారని ఆరోపణలు ఉన్నాయి. నెవెల్లి రాయ్ పలు షెల్ కంపెనీల ద్వారా భారీగా నిధులను న్యూస్ క్లిక్ కు తరలించాడని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి మనీలాండరింగ్ వ్యవహారంలో ఈడీ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది.
ఇది ఇలా వుంటే ఈ ఏడాది ఆగస్టు 17న న్యూస్ క్లిక్ కార్యాలయాలపై ఢిల్లీ పోలీసులు దాడులు చేశారు. విదేశీ నిధుల చట్టాన్ని ఉల్లంఘించినట్లు ఆరోపణలు రావడంతో వెబ్ సైట్ సిబ్బంది నివాసాల్లో పోలీసలుు దాడి చేశారు. అనంతరం వారిపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ చట్టం (UAPA)కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.