కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ (Union Sports Ministry) కీలక నిర్ణయం తీసుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI)కొత్త ప్యానెల్‌ను సస్పెండ్ చేసింది. జాతీయ పోటీలకు సంబంధించి నియమ నిబంధనలను కొత్త ప్యానెల్ పాటించకవపోడంతో సస్పెన్షన్ వేటు వేస్తున్నట్టు ప్రకటించింది. జాతీయ పోటీలకు సంబంధించి నూతన ప్యానెల్ చేసిన ప్రకటనను తొందరపాటు చర్యగా క్రీడా మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఈ విషయంలో సరైన ప్రక్రియను ప్యానెల్ పాటించలేదని పేర్కొంది. నూతన రెజ్లింగ్ ప్యానెల్ ప్రస్తుతం అమలులో ఉన్న నియమ నిబంధనలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని కేంద్రం చెప్పింది. జాతీయ స్థాయి జూనియర్ రెజ్లింగ్ పోటీలు ఈ ఏడాది చివరన ప్రారంభం అవుతాయని నూతన ప్యానెల్ చీఫ్ పంజయ్ కుమార్ సింగ్ ప్రకటించారని కేంద్ర క్రీడాశాఖ తెలిపింది.
‘జాతీయ స్థాయి పోటీల గురించి రెజ్లర్లకు కనీసం 15 రోజుల ముందు నోటీసులు ఇవ్వాలి. అప్పుడు పోటీలకు సన్నద్ధం అయ్యేందుకు రెజ్లర్లకు అవకాశం దొరుకుతుంది. కానీ కొత్త ప్యానెల్ అలా చేయలేదు. ఇది నిబంధనలను ఉల్లంఘించడమే. అలాంటి నిర్ణయాలను నిర్ణయాలను ఎగ్జిక్యూటివ్ కమిటీ తీసుకోవలసి ఉంటుంది. దానికి ముందు ఎజెండాను తయారు చేసి పరిశీనలు జరపాలి’అని వివరించింది.
నిబంధనల ఉల్లంఘన నేపథ్యంలో రెజ్లింగ్ సమాఖ్య నూతన ప్యానెల్ ను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఇది ఇలా వుంటే మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించారనే ఆరోపణలపై రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ పై వేటు పడింది. తాజాగా ఎన్నికైన అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ కు అత్యంత నమ్మకస్తుడు కావడంతో వివాదం చెలరేగింది.
ఈ ఎన్నికను నిరసిస్తూ రెజ్లర్ సాక్షి మాలిక్ రిటైర్మెంట్ ప్రకటించారు. ఆమెకు పలువురు రెజ్లర్లు మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలో క్రీడా మంత్రిత్వ శాఖ తాజా నిర్ణయం సంచలనం రేపుతోంది. మరోవైపు కేంద్ర క్రీడా శాఖ నిర్ణయాన్ని కొత్త ప్యానెల్ వ్యతిరేకిస్తోంది. దీనిపై న్యాయ పోరాటం చేయాలని భావిస్తున్నట్టు చెబుతోంది. ఈ మేరకు న్యాయ నిపుణులతో మాట్లాడుతున్నట్టు వెల్లడించింది.