ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో నూతన సంవత్సర వేడుక (New Year Celebrations)లు ఘనంగా ప్రారంభం అయ్యాయి. న్యూజిలాండ్ (Newzeland), కిరిబతి (Kiribati)దీవుల ప్రజలు 2023కు వీడ్కోలు పలికి 2024కు ఆనందోత్సాహాల నడుమ స్వాగతం పలికారు. ప్రపంచంలో మొట్ట మొదట కిరిబతి దీవికి చెందిన ప్రజలు న్యూ ఇయర్ వేడుకలను మొదలు పెట్టారు.
భారత కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకే అక్కడ న్యూ ఇయర్ వేడుకలు మొదలయ్యాయి. బాణసంచా, రంగురంగుల విద్యుత్ దీప కాంతులతో న్యూజిలాండ్‌లో నగరాలు ప్రకాశవంతంగా మెరిసిపోయాయి. న్యూజిలాండ్‌లో ఆక్లాండ్ నగరంలో న్యూ ఇయర్ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ప్రఖ్యాత స్కైటవర్ వద్ద నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలకు నగర ప్రజలు భారీగా హాజరయ్యారు.
కౌంట్ డౌన్ ముగియగానే కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతు న్యూ ఇయర్ విషెస్ తెలిపారు. అటు ఆస్ట్రేలియాలోని సిడ్నీలోని న్యూ ఇయర్ వేడుకలు మొదలయ్యాయి. ప్రఖ్యాత హార్బర్ వంతెన వద్ద కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. బ్రిడ్జిపై బాణాసంచా ప్రదర్శనను ప్రత్యక్షంగా చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు.
మరోవైపు జపాన్, దక్షిణ కొరియా, ఉత్తరకొరియాలో కూడా కొత్త సంవత్సర వేడుకలకు భారీగా ఏర్పాట్లు చేశారు. భారత కాలమానం ప్రకారం రాత్రి 8.30 గంటలకు కొత్త సంవత్సర వేడుకలు ప్రారంభం కానున్నాయి. చైనా, మలేషియా, సింగపూర్, హాంకాంగ్, పిలిప్పిన్స్ రాత్రి 9.30 గంటలకు నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు అక్కడి ప్రజలు రెడీ అయ్యారు. ఇండియా, శ్రీలంకలో ఒకే సమయంలో వేడుకలను నిర్వహించనున్నారు.