అమెరికా (America) ఆర్థిక రాజధాని న్యూయార్క్ (New Yark Rains) నగరంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకి అక్కడ వరదలు సంభవించాయి. అత్యవసరం పరిస్థితి ఏర్పడటంతో ‘స్టేట్ ఆప్ ఎమర్జెన్సీ’ (State of Emergency) ని గవర్నర్ విధించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలెవరు బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు.
రోడ్లపై ఎక్కడికక్కడ నీరు పొంగిపొర్లుతుండటంతో రవాణా సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. దీంతో రోడ్లను మూసివేసేశారు. న్యూయార్క్ గవర్నర్ కాథీ హోచుల్ శుక్రవారం అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో రాత్రిపూట 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని, పగటిపూట 18 సెంటీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. అధికారులు జారీ చేసే హెచ్చరికలను పట్టించుకోవాలని న్యూయార్క్ గవర్నర్ నగర వాసులను కోరారు. లాంగ్ ఐలాండ్, హడ్సన్ వ్యాలీలో కూడా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
న్యూయార్క్ మెట్రోపాలిటన్ ప్రాంతంలో ఉన్న వారితో పాటూ సమీప ప్రాంతాల్లోని ప్రజలకు అధికారులు వరద హెచ్చరికలు జారీ చేశారు. న్యూయార్క్‌లోని పలు ప్రాంతాల్లోకి వరద నీరు ప్రవేశించింది. బ్రూక్లిన్, మాన్‌హట్టన్, క్వీన్స్, న్యూజెర్సీలోని హోబోకెన్లోని రోడ్లు వర్షపు నీటిలో మునిగిపోయాయి. పలు రోడ్లను అధికారులు మూసివేశారు. మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టేషన్ ఏజెన్సీ అనేక సబ్వే లైన్లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రకటించింది.
అయితే వర్షం, వరదల కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదని అధికారులు తెలిపారు. వరదలు, వర్షం కారణంగా ట్రాఫిక్ మొత్తం స్తంభించింది. వరదల కారణంగా లాగార్డియా విమానాశ్రయంలో విమానాల రాకపోకలు ఆలస్యమయ్యాయి.