దేశంలో ఎన్ఐఏ (NIA) దాడులు కలకలం రేపుతున్నాయి. మొత్తం 8 రాష్ట్రాలు (States), రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు చేస్తోంది. ఉదయం 7 గంటల నుంచే ఎన్ఐఏ బృందాలు దాడులు చేస్తున్నాయి. త్రిపుర, అసోం, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, హర్యానా, పుదుచ్చేరి, రాజస్థాన్, జమ్ము కశ్మీర్ లలో ఈ దాడులు జరుగుతున్నట్టు ఎన్ఐఏ వర్గాలు వెల్లడించాయి.
మానవ అక్రమ రవాణా కేసులకు సంబంధించి ఈ దాడులు చేస్తున్నట్ట ఎన్ఐఏ వర్గాలు పేర్కొన్నాయి. కొంతమంది శ్రీలంక జాతీయులు భారత్‌లో అక్రమంగా ఉంటున్నారనే ఆరోపణలపై గత నెలలో ఎన్ఐఏ దాడులు చేసింది. ఈ కేసులో మహ్మద్ ఇమ్రాన్ అనే వ్యక్తిని ఎన్ఐఏ అరెస్టు చేసింది.
ఇమ్రాన్ నుంచి రాబట్టిన సమాచారం మేరకు ఈ దాడులు చేస్తున్నట్టు తెలుస్తోంది. 40 ప్రాంతాల్లో ఈ దాడులు జరుగుతున్నట్టు ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి. చెన్నై సమీపంలోని పెరుంబాకం, పదప్పాయ్, మరైమలైనగర్‌లో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఫోర్జరీ సంతకాలతో నకిలీ పత్రాలు సృష్టించిన పలువురిని ఎన్ఐఏ ఈ సందర్బంగా అరెస్టు చేసినట్టు సమాచారం. ఈ కేసులో తాజాగా జ్యూస్ షాపు నిర్వహకుడిని ఎన్ఐఏ అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. అతనితో పాటు ఆతని రూమ్ మేట్ ను కూడా ఎన్ఐఏ అదుపులోకి తీసుకున్నట్టు పేర్కొంది.