ఏపీ ( AP)లో ఎన్ఐఏ (NIA) దాడులు (Raids) కలకలం రేపుతున్నాయి. పలు జిల్లాల్లో సోమవారం ఉదయం నుంచే ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గుంటూరు , నెల్లూరు, శ్రీకాకుళం, విజయవాడ, ప్రకాశం జిల్లాల్లో ఎన్.ఐ.ఎ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఏపీలో మొత్తం 15 ప్రాంతాల్లో ఎన్‌ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. రాష్ట్రంలో మావోయిస్టు సానుభూతి పరులే లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నట్టు ఎన్ఐఏ వర్గాలు చెబుతున్నాయి. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో కుల నిర్మూలన పోరాట సమితి నాయకుడు దుడ్డు వెంకట్రావు నివాసంలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా పౌరహక్కుల ఉద్యమంలో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు.
పలు ఉద్యమాల్లో భాగస్వామునిగా వుంటూ వామపక్షాలతో కలిసి పౌర హక్కుల పై ప్రజలను నిరంతరం చైతన్య పరిచే వారు. ఆయన నివాసంలో సుమారు 4 గంటల పాటు అధికారులు తనిఖీలు చేశారు. ఆ సమయంలో ఓ కీలకమైన డైరీని ఎన్ఐఏ స్వాదీనం చేసుకున్నట్టు సమాచారం. ఇక ఇప్పటికే వెంకట రావు సోదరుడు కుల నిర్మూలన పోరాట సమితి అధ్యక్షుడు దుడ్డు ప్రభాకర్ రావు ను ఎన్.ఐ.ఏ అధికారులు అరెస్టు చేశారు.
ఈ నెల 20న హైదరాబాద్‌లోని ఎన్.ఐ.ఎ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని వెంకట రావుకు ఎన్ఐఏ అధికారులు నోటీసులు జారీ చేశారు. మరో పక్క బాపట్ల జిల్లా సంతమాగులూరు లోని ఓరు శ్రీనివాసరావు ఇంట్లో కూడా ఎన్‌ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. అంతకు ముందు ఈ రోజు ఉదయం తిరుపతి (Tirupathi)లో ప్రముఖ న్యాయవాది, హక్కుల సంఘం నేత క్రాంతి చైతన్య ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు.
తిరుచానూరు, యోగిమల్లవరంలోని ఎస్వీపీ కాలనీలోని ఆయన ఇంటి వద్ద అధికారులు దాడులు చేశారు. మరోవైపు గూడూరు సమీపంలోని బాలయ్య గారి పల్లెలోనూ ఎన్ఐఏ తనిఖీలు చేసింది. మరోవైపు గుంటూరు జిల్లాలోనూ ఎన్ఐఏ అధికారులు దాడులు చేస్తున్నారు. పొన్నూరులోని ప్రజా వైద్యశాలలో ఎన్ఐఏ బృంధం తనిఖీలు చేస్తున్నాయి.
జిల్లా పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు డాక్టర్. టీ. రాజారావుకు చెందిన ప్రజా వైద్యశాలలో ఎన్ఐఏ తనిఖీలు చేస్తున్నారు. ఉదయాన్నే ప్రజా వైద్య శాలకు చేరుకున్న ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇక మంగళగిరి మండలం నవులురు గ్రామంలో పచ్చల కిరణ్ నివాసంలో , తాడేపల్లి మహానాడులో బత్తుల రమణయ్య ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రగతిశీల కార్మిక సమాఖ్య ప్రజా సంఘంలో బత్తుల రమణయ్య కోశాధికారిగా పనిచేశారు. ఇక గతంలో పచ్చల కిరణ్ విప్లవ రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు.