ఖలిస్తాన్ (Khalisthan) మద్దతుదారులు, గ్యాంగ్ స్టర్స్ టార్గెట్ గా జాతీయ దర్యాప్తు సంస్థ (National Investigation Agency) దాడులు (Raids) చేస్తోంది. పంజాబ్ , హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్ ప్రాంతాల్లో ఎన్ఐఏ తనిఖీలు నిర్వహిస్తోంది. మొత్తం 50 ప్రాంతాల్లో ఈ దాడులు చేస్తున్నట్టు ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి.
పంజాబ్ లోని 30 ప్రాంతాలు, రాజస్థాన్ లోని 13 ప్రాంతాలు, హర్యానాలోని 4, ఉత్తరాఖండ్ లోని 2, ఢిల్లీ, యూపీలోని ప్రాంతాల్లో ఈ దాడులు జరుగుతున్నట్టు ఎన్ఐఏ పేర్కొంది. ఇప్పటి వరకు అరెస్టైన ఖలిస్తానీ ఉగ్రవాదులు, గ్యాంగ్ స్టర్స్ నుంచి దర్యాప్తు సమయంలో సేకరించిన సమాచారం మేరకు ఈ దాడులు కొనసాగుతున్నట్టు ఎఐఏ వెల్లడించింది.
ఇతర దేశాలలో ఉన్న ఖలిస్తానీ, గ్యాంగ్స్టర్ భారత్ లోని మద్దతుదారులకు మాదక ద్రవ్యాలు, ఆయుధాల కోసం హవాలా మార్గాల ద్వారా నిధులు సమకూరుస్తున్నారని ఎన్ఐఏ వర్గాలు వెల్లడించాయి. ఖలిస్తానీ, ఐఎస్ఐ, గ్యాంగ్ స్టర్స్ కు మధ్య సంబంధాలపై తమకు విశ్వసనీయ సమాచారం అందినట్టు పేర్కొన్నాయి. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నట్టు చెప్పాయి.
ఇది ఇలా వుంటే అమృత్ సర్, చండీగఢ్ లోని సిఖ్స్ ఫర్ జస్టిస్ చీఫ్ గురు పత్వంత్ సింగ్ పన్నూకు చెందిన ఆస్తులను ఇటీవల ఎన్ఐఏ జప్తు చేసంది. అమృత్ సర్ లోని వ్యవసాయ భూమి, చండీగఢ్ లోని ఇంటిని సీజ్ చేసినట్టు ఎన్ఐఏ వివరించింది. ఉగ్రవాదానికి సంబంధించిన కేసులో ఓ వ్యక్తి ఆస్తులు జప్తు చేయడం దేశంలో ఇదే తొలి సారి కావడం గమనార్హం.