ఇండియా కూటమి (INDIA Alliance) ప్రధాని అభ్యర్థిగా మల్లికార్జున ఖర్గేను ప్రకటించడంపై మిత్రపక్షం జేడీయూ నేత, సీఎం నితీశ్ కుమార్ (CM Nitish Kumar) అసంతృప్తిగా ఉన్నారంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. తాజాగా ఆ వార్తలను సీఎం నితీశ్ కుమార్ తోసిపుచ్చారు. విపక్ష కూటమి ప్రధాని అభ్యర్థిగా ఖర్గేను ప్రకటించడంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదని వెల్లడించారు.
ఇండియా కూటమి, జేడీయూ కలిసే ఉన్నాయని తెలిపారు. 2024 లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమితో కలిసి ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. ఇండియా కూటమిలో తీసుకున్న నిర్ణయంపై తనకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి జయంతి సందర్బంగా వాజ్ పేయికి నితీశ్ కుమార్ నివాళులు అర్పించారు.
అనంతరం నితీశ్ కుమార్ మాట్లాడుతూ….. తనకు పదవుల పట్ల ఎలాంటి ఆసక్తి లేదని చెప్పారు. తామంతా కలిసే పని చేస్తున్నామని అన్నారు. మీకు ఎవరిని కావాలంటే వాళ్లను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించండని సమావేశంలో తాను చెప్పానన్నారు. సీట్ల సర్దుబాటు గురించి ముందు తేల్చాలని మాత్రమే సూచనలు చేశానన్నారు. సీట్ల సర్దుబాటు ఫార్ములాను త్వరలోనే ప్రకటిస్తామన్నారు.
ఇటీవల ఇండియా కూటమి నాల్గవ సమావేశం ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో విపక్ష కూటమి ప్రధాని అభ్యర్థిగా ఖర్గే పేరును విపక్షాలు ప్రకటించాయి. ఈ క్రమంలో నితీశ్ కుమార్ అసంతృప్తిగా ఉన్నారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో నితీశ్ కుమార్ కు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫోన్ చేసి బుజ్జగించారని పెద్ద ఎత్తున వార్తలు చెక్కర్లు కొట్టాయి.