హలాల్ ఉత్పత్తుల (Halal Products) తయారీ, విక్రయం, నిల్వపై యూపీ సర్కార్ (UP Governament) నిషేధం విధించింది. దీంతో కేవలం యూపీలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా హలాల్ ఉత్పత్తులపై నిషేధం విధించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో హలాల్ ఉత్పత్తులపై కేంద్రం నిషేధం విధించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో హలాల్ ఉత్పత్తుల నిషేధం పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) స్పందించారు.
హలాల్ సర్టిఫైడ్ ఉత్పత్తుల విక్రయాలపై నిషేధం విధించేందుకు కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అమిత్ షా వెల్లడించారు. ఈ విషయంపై ఇప్పటి వరకు తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని షా వెల్లడించారు. అమిత్ షా ప్రస్తుతం తెలంగాణలో పర్యటిస్తున్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ….గత దశాబ్ద కాలంగా పోటీ చేస్తున్న పార్టీల పనితీరును చూసి ఓటు వేయాలని ప్రజలను కోరారు.
ప్రజల ఓటు అనేది కేవలం ఎమ్మెల్యే, ప్రభుత్వ తల రాతను మాత్రమే నిర్ణయించదన్నారు. ఈ రాష్ట్ర ప్రజల భవితవ్యాన్ని కూడా నిర్ణయిస్తుందన్నారు. అందువల్ల గత దశాబ్దకాలంగా పార్టీల పనితీరును పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఓట్లు వేయాలని కోరారు. అన్ని పార్టీల పనితీరును గమనించాక ప్రజలు తప్పకుండా మోడీ నేతృత్వంలోని బీజేపీకి ఓటు వేస్తారని నమ్మకం ఉందన్నారు.
బీఆర్‌ఎస్ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని షా ఆరోపించారు. మతపరమైన రిజర్వేషన్లు కేసీఆర్ ఇచ్చారని మండిపడ్డారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. తాము మతపరమైన మైనారిటీలకు 4 శాతం కోటాకు స్వస్తి పలుకుతామన్నారు. ఆ రిజర్వేషన్ ను షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులాలు ఇతర వెనుకబడిన తరగతులకు ఇస్తామన్నారు.