మహిళా రిజర్వేషన్ (Woman Reservation) బిల్లుపై ఏఐఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi) తన వ్యతిరేకతను తెలియజేశారు. ఈ బిల్లులో ఓబీసీ(OBC), ముస్లిం మహిళల (Muslim Woman) కోటా గురించి ఇందులో ప్రస్తావించలేదన్నారు. అందువల్ల ఈ బిల్లును తాను వ్యతిరేకిస్తున్నానని చెప్పారు.
ప్రాతినిధ్యం అనేది ఎవరికి కల్పించాలి? అని ప్రశ్నించారు. ప్రాతినిధ్యం లేనివారికే ప్రాతినిధ్యం కల్పించాల్సి వుంటుందన్నారు. ఓబీసీ, ముస్లిం మహిళలకు కోటా లేకపోవడం ఈ బిల్లులో ప్రధాన లోపమని తెలిపారు. అందుకే ఈ బిల్లును తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఆయన వెల్లడించారు.
తక్కువ ప్రాతినిధ్యం ఉన్నవారి ప్రాతినిధ్యం ఉండేలా మీరు బిల్లు తీసుకు వస్తున్నారని అన్నారు. ఇప్పటి వరకు 17 లోక్‌సభ ఎన్నికల్లో 8,992 మంది ఎంపీలు ఎన్నికయ్యారని చెప్పారు. వారిలో కేవలం 520 మంది మాత్రమే ముస్లింలు ఉండగా అందులో కొద్దిమంది కూడా మహిళలు లేరన్నారు. 50 శాతం లోటు ఉందన్నారు.
చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు కేంద్రం మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకు వచ్చింది. ‘నారీ శక్తి వందన్ అభియాన్’ పేరుతో ఈ బిల్లును ఈ రోజు లోక్ సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశ పెట్టారు. దీనిపై లోక సభలో రేపు చర్చ జరగనుంది.