జీ20 సదస్సు(G20 Meeting) ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తోంది భారత ప్రభుత్వం. శిఖరాగ్ర సదస్సు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఈనెల 9, 10వ తేదీల్లో ఢిల్లీ(Delhi)లోని ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపంలో జీ20 సమ్మిట్ జరగనుంది. ఈ సదస్సుకు ప్రపంచదేశాల నుంచి నాయకులు తరలివస్తున్నారు. ఢిల్లీలో జరుగుతున్న ఈ హైప్రొఫైల్ సమావేశాల సందర్భంగా.. భద్రత కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.
జీ20 సదస్సు కోసం ఢిల్లీలో భద్రతా వలయాన్ని నిర్మించారు. మూడు రోజుల పాటు ఆంక్షలు కూడా విధించారు. ఈనెల 7వ తేదీ రాత్రి నుంచే నిర్దేశిత ప్రాంతాల్లో ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ఢిల్లీ నగరంలో స్విగ్గీ(Swiggy), జొమాటో (Zomato)వంటి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ, అమెజాన్(Amazon) డెలివరీలను కూడా నిషేధించారు.
ఈనెల 7వ తేది అర్ధరాత్రి నుంచి 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఢిల్లీలోకి వాహనాల ప్రవేశాన్ని కూడా నిలిపివేస్తున్నట్టు గురుగ్రామ్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఢిల్లీలో ఈనెల 8 నుంచి 10వ తేదీ వరకు పబ్లిక్ హాలిడీ ప్రకటించారు. 9, 10వ తేదీ అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సెలవు ప్రకటించారు.
ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం అమలు చేయాలని కంపెనీలకు సూచించారు. ఆంక్షలు అమల్లో ఉన్న నిర్దేశిత ప్రాంతాల్లో థియేటర్లు, రెస్టారెంట్లు కూడా మూసివేయాలని ఆదేశించారు. అంతేకాదు.. క్లౌడ్ కిచెన్లు, డెలివరీ సేవలకు కూడా అనుమతి నిరాకరించారు. జీ20 సమ్మిట్ జరుగుతన్న రోజుల్లో దేశ రాజధానిలో హైఅలర్ట్ కొనసాగుతూనే ఉంటుంది.