పార్లమెంట్ (Parliament)లో ఎంపీ (MP)ల సస్పెన్షన్ పై కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియాగాంధీ (Sonia Gandhi) ఫైర్ అయ్యారు. పూర్తిగా సహేతుకమైన, చట్టబద్ధమైన డిమాండ్లను విపక్షాలు లేవనెత్తినందుకు ప్రజాస్వామ్య గొంతును ఈ ప్రభుత్వం నొక్కి వేసిందని తెలిపారు. గతంలో ఇంత పెద్ద ఎత్తున ఎంపీలను ఎప్పుడూ పార్లమెంట్ లో సస్పెండ్ చేయలేదని పేర్కొన్నారు.
డిసెంబర్ 13న జరిగిన పార్లమెంట్ భద్రతా లోపంపై కేంద్ర హోం మంత్రి ఓ ప్రకటన చేయాలని మాత్రమే ఎంపీలు పట్టుబట్టారని వెల్లడించారు. ఈ ఘటన క్షమించరానిదని, సమర్థించలేవని వెల్లడించారు. ఈ ఘటనపై జాతిని ఉద్దేశించి మాట్లాడేందుకు, ఘటనపై తన అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు ప్రధాని మోడీకి నాలుగు రోజుల సమయం పట్టిందన్నారు. అది కూడా పార్లమెంట్ బయట స్పందించారన్నారు.
ఇలా చేయడం ద్వారా పార్లమెంట్ పట్ల తనకున్న అసహ్యతను, ప్రజల పట్ల ఉన్న నిర్లక్ష్యాన్ని ప్రధాని స్పష్టంగా వెల్లడించారన్నారు. జమ్ము కాశ్మీర్ బిల్లులపై చర్చ సందర్భంగా దివంగత మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూపై పలు వ్యాఖ్యలు చేశారన్నారు. నెహ్రూ లాంటి దేశ భక్తుల పరువు తీసేందుకు చరిత్రను మోడీ వక్రీకరించారంటూ ధ్వజమెత్తారు.
ఈ ప్రచారానికి స్వయంగా ప్రధాని, హోం మంత్రి అమిత్ షా నేతృత్వం వహించారని నిప్పులు చెరిగారు. కానీ తాము భయపడలేదన్నారు. ఈ విషయంలో వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని తాము నిర్ణయించుకున్నామని చెప్పారు. జమ్ముకశ్మీర్ రాష్ట్ర హోదాను తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. వీలైనంత త్వరగా జమ్ములో ఎన్నికలు నిర్వహించాలన్నారు. లఢక్ ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చాలన్నారు.
ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తమ పార్టీకి తీవ్ర నిరాశనకు కలిగించాయన్నారు. దీనిపై ఇప్పటికే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించారని అన్నారు. ప్రస్తుతం పార్టీ అనేక సవాళ్లను ఎదుర్కుంటోందన్నారు. అయినప్పటికీ తమ ధైర్యమే తమను ముందుకు నడిపిస్తోందన్నారు.