తెలంగాణలో ఓబీసీ (OBC) సమస్యలపై అఖిల భారత కాంగ్రెస్ కమిటీ, ఓబీసీ విభాగ చైర్మన్ కెప్టెన్ అజయ్ సింగ్ యాదవ్ (Ajay Singh Yadav)తో భారతీయ ఓబీసీ సమాఖ్య జాతీయ అధ్యక్షులు కే.కోటేశ్వర్ రావు, ప్రధాన కార్యదర్శి ఆనం చిన్ని వెంకటేశ్వర రావు, దక్షిణాది రాష్ట్రాల కన్వీనర్ పాశం యాదగిరి సమావేశం అయ్యారు. హర్యానా ఏఐసీసీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పలు సమస్యల గురించి చర్చించారు.
తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ఈ సందర్బంగా అజయ్ సింగ్ యాదవ్ ను ఓబీసీ నేతలు కోరారు. తెలంగాణ ప్రజలు, నిరుద్యోగులు, విద్యావంతులతో పాటు అన్ని వర్గాలు కాంగ్రెస్ కు పట్టం కట్టాయన్నారు. ఎన్నికల మెనిఫెస్టోలో ఆరు హామీలను కాంగ్రెస్ ఇచ్చిందన్నారు. వాటిని నిలబెట్టుకోవాలని ఈ సందర్బంగా కోరారు.
నాన్ ఏసీ ఎక్స్ ప్రెస్ బస్సుల వరకు రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు. విద్యార్థులకు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, ప్రైవేట్ వర్శిటీల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ప్రకారం 50 శాతం భర్తీ చేయాలన్నారు. అందుకోసం చట్టాన్ని కూడా సవరించాలన్నారు.
కుల గణన వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. జనవరిలో జరిగే సర్పంచ్, జెడ్పీటీసీ, మండల, స్థానిక సంస్థల ఎన్నికల్లో సామాజిక తరగతుల రిజర్వేషన్లకు దీన్ని ప్రాతిపదికగా తీసుకోవాలన్నారు. కనీసం 50 శాతం రిజర్వేషన్లను పెంచాలన్నారు. ఉద్యోగాల భర్తీకి నియోజకవర్గాల వారీగా ప్రాతినిధ్యం ఇవ్వాలన్నారు. అప్పుడే అసమానతలు తగ్గుతాయన్నారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలను ఆయా శాఖల ఆధ్వర్యంలో ప్రభుత్వం వర్శిటీలుగా అభివృద్ధి చేయాలన్నారు. పది జిల్లాలను ముప్పై మూడు జిల్లాలుగా చేశాక సిబ్బందిని పెంచలేదన్నారు. పది జిల్లాల సిబ్బందిని మొత్తం జిల్లాల్లో సర్దుబాటు చేయడంతో పాలన కుంటుపడిందన్నారు. ప్రతి జిల్లాలోనూ నూతనంగా సిబ్బందిని నియమించాల్సి ఉందన్నారు.
మిషన్ భగీరథ, కాళేశ్వరం, మిషన్ కాకతీయ తదితర లోపాలపై సమగ్ర విచారణ కమిషన్ ను నియమించి వాస్తవాలు వెల్లడించాలని కోరారు. ప్రతి గ్రామానికి రక్షిత మంచినీరు అందడం లేదని వాటిని సమీక్షించాలన్నారు. డబుల్ బెడ్‌రూం పంపిణీలో అవకతవకలు జరిగాయన్నారు. ఆయా పథకాలను సక్రమ వినియోగంపై విచారణ కమిషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ నేతలతో ఈ రోజు సమావేశం కానున్నారు. అనంతరం మిగిలిన పార్టీలతో భేటీ కానున్నారు.