ఒడిశా (Odissa)లో కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు (Deeraj Sahu) నివాసంలో ఆదాయ పన్ను శాఖ తనిఖీలు వరుసగా ఆరవ రోజు కూడా కొనసాగాయి. జార్ఖండ్, ఒడిశాలో సాహుకు సంబంధించి పలు ప్రాంతాల్లో ఇప్పటి వరకు రూ. 353 కోట్ల సొమ్మును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దేశంలో ఐటీ రెయిడ్స్ లో ఈ స్థాయిలో డబ్బు పట్టుబడటం ఇదే తొలిసారి అని ఐటీ అధికారులు చెబుతున్నారు.
ఐదు రోజుల పాటు ఈ డబ్బును అధికారులు లెక్కించారు. లెక్కింపు సమయంలో కౌంటింగ్ మెషిన్స్ మొరాయించాయి. దీంతో లెక్కింపు ప్రక్రియ ఆలస్యం అయింది. మొత్తం 176 డబ్బు సంచుల్లోని కట్టలను అధికారులు లెక్కించారు. ఈ మొత్తాన్ని బాలంగిర్ ఎస్బీఐ బ్రాంచీలో డిపాజిట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కరెన్సీ మొత్తం బిజినెస్ గ్రూపు, పంపిణీదారుల, ఇతరులు దేశీయ మద్యం అమ్మకాల ద్వారా సంపాదించిన “ఖాతాలో చూపబడని” డబ్బు అని అధికారులు అన్నారు.
కాంగ్రెస్ ఎంపీ నివాసంలో భారీగా డబ్బు సంచులు దొరకడంపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. బీజేపీ ఎంపీలంతా పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్కు వ్యతిరేకంగా నిరసనకు దిగారు. కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు నివాసంలో భారీగా డబ్బుల సంచుల వ్యవహారంపై రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఎందుకు మాట్లాడట్లేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ప్రశ్నించారు. ఈ విషయంలో వారు మౌనం వీడాలని ఆయన డిమాండ్ చేశారు.
కాంగ్రెస్, అవినీతి ఒకే నాణనికి రెండు ముఖాలు అని ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ, ధీరజ్ సాహు నేతృత్వంలో సాగుతున్న ఈ లిక్కర్ దందాలో పట్టుబడ్డ ఈ నల్లధనం ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. ఇది ఎవరికి చెందుతుంది అనే సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. ‘ఒక ఎంపీ ఇంట్లో భారీగా నగదు పట్టుబడటం చూస్తే తనకు చాలా ఆశ్చర్యంగా ఉందని అమిత్ షా అన్నారు.
ఈ అవినీతిపై ఇండియా కూటమిలోని పార్టీలన్నీ ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఐటీ, ఈడీ వంటి వాటిని ప్రధాని మోడీ దుర్వినియోగం చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఎందుకు పదే పదే గొడవ చేస్తున్నాయో తనకు ఇప్పుడు అర్థమవుతోందన్నారు. ఎందుకంటే వారి అవినీతి బయటపడుతుంది కాబట్టే వారు అలాంటి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.