పార్లమెంట్ నూతన భవనం (Parliament New Building) లోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోడీ (PM Modi) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి పార్లమెంట్ పాత భవనాన్ని ‘సంవిధాన్ సదన్’(Samvidhan Sadhan) గా పిలవాలని ఆయన అన్నారు. గత 75 ఏండ్లుగా ఈ పార్లమెంట్ భవనంలో సమావేశాలు జరుగుతున్నాయన్నారు. ఆ భవనాన్ని కేవలం పాత భవనంగా పిలిచి దాన్ని గౌరవాన్ని తగ్గించకూడదన్నారు.
నూతన భవనంలోకి వెళ్లినంత మాత్రాన పార్లమెంట్ పాత బిల్డింగ్ హుందాతనం ఏమాత్రం తగ్గిపోవద్దని సూచించారు. ఈ భవనాన్ని ‘సంవిధాన్ సదన్’గా పేర్కొనడం పార్లమెంటులో చరిత్ర సృష్టించిన నాయకులకు నివాళులర్పించినట్లవుతుందని ప్రధాని అన్నారు. భవిష్యత్ తరాలకు ఈ వర్తమానాన్ని అందించే అవకాశాన్ని మనం వదులుకోకూడదన్నారు.
దేశాన్ని ఆత్మ నిర్భరంగా మార్చడమే మనందరి బాధ్యతగా ఉండాలని పేర్కొన్నారు. దేశ భవిష్యత్ కోసం సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. కేవలం రాజకీయ లాభాల గురించి ఆలోచించవద్దని చెప్పారు. జ్ఞానం-ఆవిష్కరణలపై ఫోకస్ చేయాలన్నారు. ప్రధాని మోడీ ప్రసంగం తర్వాత పార్లమెంట్ ను నూతన భవనంలోకి మార్చారు.
ప్రసంగం ముగిసిన వెంటనే ఎంపీలంతా పాత భవనం నుంచి కొత్త భవనానికి నడిచి వెళ్లారు. పార్లమెంట్ నూతన భవనంలోకి ప్రవేశించగానే ఎంపీలందరికీ ప్రత్యేక గిఫ్టులు అందజేశారు. అందులో ఒక బ్యాగులో రాజ్యాంగ పుస్తకం, పార్లమెంట్ విశిష్టతలను వివరించే పుస్తకం, స్మారక చిహ్నం వున్నాయి.