జమ్ము కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah)కు షాక్ తగిలింది. ఆయన దాఖలు చేసిన విడాకుల పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) తోసి పుచ్చింది. భార్య నుంచి విడాకులు కోరకునేంతగా బలమైన కారణాలు ఏవీ కనిపించడం లేదని వెల్లడించింది. ఈ మేరకు పిటిషన్ పై విచారణకు జస్టిస్ సంజీవ్ సచ్‌దేవా, జస్టిస్ వికాస్ మహాజన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం నిరాకరించింది.
ఒమర్ అబ్దుల్లా తన భార్య క్రూరత్వానికి సంబంధించి చేస్తున్న ఆరోపణలు అస్పష్టంగా ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది. ఆయన ఆరోపణలు ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేవని స్పష్టం చేసింది. ఈ విషయంలో ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పులో తమకు ఎలాంటి లోపాలు కూడా కనిపించడం లేదని వెల్లడించింది.
తన భార్య తనను శారీరకంగా లేదా మానసికంగా ఇబ్బందులకు గురి చేశారనే విషయాన్ని ఒమర్ అబ్దుల్లా నిరూపించుకోలేకపోయారని ధర్మాసనం తెలిపింది. అందుకే పిటిషన్ ను తిరస్కరిస్తున్నట్టు చెప్పింది. అంతకు ముందు 2016 ఆగస్టు 30న ఒమర్ అబ్దుల్లా పిటిషన్ ను ట్రయల్ కోర్టు కొట్టి వేసింది. దీంతో ట్రయల్ కోర్టు తీర్పును ఢిల్లీ హైకోర్టులో ఒమర్ అబ్దుల్లా సవాల్ చేశారు.
ఇది ఇలా వుంటే నిన్న ఆర్టికల్ 370 రద్దును సుప్రీం కోర్టు సమర్థించడం, ఈ రోజు విడాకుల పిటిషన్ ను ఢిల్లీ కోర్టు తిరస్కరించడం వంటి పరిణామాలతో ప్రస్తుతం ఆయన కలత చెందారు. ఈ క్రమంలో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. కొన్నివారాల పాటు తాను ఎవరికీ అందుబాటులో ఉండనని ఒమర్ అబ్దుల్లా తెలిపారు.