‘డీప్ ఫేక్ వీడియోల’ (Deep Fake Videos)పై ప్రధాని మోడీ (PM Modi) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. డీప్ ఫేక్ వీడియోలతో మొత్తం వ్యవస్థకే పెను ముప్పు ఉందన్నారు. డీప్ ఫేక్ వీడియోలను గుర్తించాలని, ఇంటర్నెట్‌లో అలాంటి వీడియోలు ప్రసారమైనప్పుడు వెంటనే హెచ్చరికలు జారీ చేయాలని తాను చాట్ జీపీటీ బృందాన్ని కోరినట్టు వెల్లడించారు.
బీజేపీ నిర్వహించిన దీపావళి మిలన్ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మోడీ మాట్లాడుతూ…. కొత్త టెక్నాలజీ ఆవిర్బావంతో సమాజంలో పెరుగుతున్న సమస్యలపై ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పించాలని మీడియాను ప్రధాని కోరారు. డీప్‌ఫేక్‌ల కోసం కృత్రిమ మేధస్సును దుర్వినియోగం చేసే విషయంలో పౌరులు, మీడియా అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఇటీవల తాను గార్బా చేస్తున్నట్టుగా డీప్ ఫేక్ వీడియోను సృష్టించారన్నారు. ఆ వీడియోలో తాను గార్బా పాట పాడుతున్నట్టుగా కనిపిస్తోందన్నారు. ఇలాంటి వీడియోలు చాలానే వచ్చాయన్నారు. ముఖ్యంగా ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో డీప్‌ఫేక్ వీడియోలు ఎన్నికల ప్రజాస్వామ్య సమగ్రతకు అతి పెద్ద సవాళ్లుగా మారుతున్నాయన్నారు.
సోషల్ మీడియాలో వస్తున్న వీడియోలు, ఫొటోలు నిజమైనవా లేదా నకిలీవా అని గుర్తించడం చాలా కష్టతరంగా మారిందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానంగా రాజకీయ నాయకులను టార్గెట్ చేసుకుని క్రియేట్ చేసిన చిత్రాలు, నకిలీ వీడియో క్లిప్‌లు, ఫేక్ వాయిస్‌ఓవర్‌ల వంటి డీప్‌ఫేక్‌ల బెదిరింపులను రాబోయే రోజుల్లో సమాజం ఎదుర్కోనుందన్నారు.
ఇటీవల నటి రష్మిక మందన్నాకు చెందిన డీప్ ఫేక్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై ఇప్పటికే సినీ, రాజకీయ, టెక్నాలజీ రంగాల ప్రముఖులు స్పందించారు. ఆ తర్వాత బాలీవుడ్ నటులు కాజోల్, కత్రినా కైఫ్ కూడా డీప్ ఫేక్ బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలపై సోషల్ మీడియా సీఈవోలకు కేంద్రం గైడ్ లైన్స్ జారీ చేసింది.