14 మంది యాంకర్లను బాయ్ కాట్ చేయాలని కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయంపై అసోం ముఖ్య మంత్రి హిమంత బిశ్వ శర్మ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం కాంగ్రెస్ కొత్తకాదన్నారు. ఎమర్జెన్సీ రోజుల్లో కాంగ్రెస్ ఇలాంటి నిర్ణయాలు తీసుకుందన్నారు. ఒక వేళ కాంగ్రెస్ సర్కార్ వస్తే మీడియాపై సెన్సార్ విధిస్తారంటూ ఫైర్ అయ్యారు.
1975లోనే మీడియాపై కాంగ్రెస్ నిషేధం విధించిందన్నారు. ఇప్పుడు ఇది మీడియాకు రిహాల్సల్ మాత్రమేనన్నారు. సరైన సమయంలో ఇస్రో చంద్రయాన్ ప్రయోగం చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ మొత్తాన్ని తాను చంద్రుని పైకి పంపిస్తానన్నారు. వాళ్లు అక్కడికి వెళ్లి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ది చైల్డిష్ డెసిషన్ గా అభివర్ణించారు.
మరోవైపు కాంగ్రెస్ పై నిన్న బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్ర విరుచుకుపడ్డారు. దేశంలోని ప్రతి వ్యవస్థపై కాంగ్రెస్ దాడి చేసిందన్నారు. కాంగ్రెస్ నిర్ణయం ఆ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లోనూ మేలు చేయదని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలంతా ఎవరి పని వాళ్లు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. కానీ తన పని తాను సరిగ్గా చేయని ఏకైక వక్యి రాహుల్ గాంధీ మాత్రమేనన్నారు.
ఇది ఇలా వుంటే కాంగ్రెస్ నిర్ణయాన్ని ఆ పార్టీ సీనియర్ నేత పవన్ ఖేరా సమర్థించుకున్నారు. తాము ఎవరినీ నిషేధించలేదన్నారు. తాము ఎవరినీ బాయ్ కాట్ చేయలేదని స్పష్టం చేశారు. కేవలం దేశంలో విద్వేషాన్ని రెచ్చగొట్టే వారికి సహకరించ కూడదని తాము నిర్ణయించామన్నారు. దీన్ని సహాయ నిరాకరణ ఉద్యమంగా ఆయన తెలిపారు. ఆయా యాంకర్లు తమ పద్దతి మార్చుకుంటే తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే ఆలోచన చేస్తామన్నారు.