యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్స్ అంటోనీ బ్లింకన్ (Antony Binken)తో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ (s. Jai Shankar) భేటీ అయ్యారు. రక్షణ, అంతరిక్ష, ఇంధన రంగంలో సహకారం కొనసాగించాలని ఇరు దేశాలు నిర్ణయించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. జీ-20 దేశాల సదస్సు తర్వాత ఇరు దేశాల మధ్య జరుగుతున్న అతి పెద్ద భేటీ ఇదే కావడం గమనార్హం.
కెనడాతో దౌత్య ప్రతిష్టంభనల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే సమావేశంలో కెనడా గురించి ఎలాంటి ప్రస్తావన రాలేదని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇక దీనిపై ఇరువురు నేతలు కూడా ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. ఈ భేటీ గురించి భారత విదేశాంగ మంత్రి ట్వీట్ చేశారు. తన స్నేహితుడు యూఎస్ ఆఫ్ స్టేట్స్ ఆంటోని బ్లింకన్ ను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని ట్వీట్ లో పేర్కొన్నారు.
అమెరికాలో ప్రధాని మోడీ జూన్ పర్యటన తర్వాత మరోసారి విస్తృత సమావేశం జరిగినట్టు చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలపై ఇరువురు చర్చించినట్టు వెల్లడించారు. ఇండియా జీ-20 అధ్యక్షత తర్వాత ఫలితాలు, ఇండియా- మిడిల్ ఈస్ట్- యూరప్ ఎకనామిక్ కారిడార్ ఏర్పాటు, మౌలిక సదుపాయాలు, ఇరు దేశాల మధ్య పెట్టుబడులు సహా పలు అంశాలపై ఇరువురు నేతలు విస్తృతంగా చర్చించారని స్టేడ్ డిపార్ట్ మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తెలిపారు.
ఇరు దేశాల మధ్య పలు రంగాల్లో సహకారాన్ని కొనసాగించే విషయంలో ఇరువురు నేతలు చర్చించారన్నారు. ముఖ్యంగా రక్షణ, అంతరిక్షం, ఇంధన రంగాల్లో సహకారం కొనసాగించాలని ఇరు దేశాలు నిర్ణయించినట్టు మిల్లర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇది ఇలా వుంటే ఢిల్లీలో యూఎస్-భారత్ మంత్రుల (2+2) సమావేశం జరగనున్నట్టు విదేశాంగ మంత్రి జై.శంకర్ వెల్లడించారు.
సమావేశ తేదీలను మాత్రం ఆయన వెల్లడించలేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ సమావేశం వచ్చే నెల రెండో వారంలో జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి జైశంకర్, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్స్ అంటోని బ్లింకెన్, డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ అస్టిన్ పాల్గొంటారని అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది.