ఇస్రో (ISRO) నిర్వహించిన గగన్ యాన్ (Gaganyan) టీవీ-డీ 1 ప్రయోగం ఈ రోజు విజయవంతం అయింది. ఈ క్రమంలో ప్రధాని మోడీ (PM Modi) స్పందించారు. టీవీ-డీ1 విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలను ఆయన ప్రశంసించారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధాని మోడీ సంతోషం వ్యక్తం చేశారు.
ఈ ప్రయోగం సక్సెస్ అనేది భారత్‌ను తన మొదటి మానవ అంతరిక్ష కార్యక్రమం దిశలో మరో అడుగు దగ్గరగా తీసుకు వెళ్లిందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. మొదట ఈ ప్రయోగానికి ఉదయం 8 గంటలకు ప్రారంభించాలని అనుకున్నారు.
కానీ ప్రయోగానికి ముందు ఇంజన్ ఇగ్నిషన్‌లో సాంకేతిక లోపాలు తలెత్తాయి. దీంతో అలర్ట్ అయిన శాస్త్రవేత్తలు ప్రయోగాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. గగన్ యాన్ టెస్ట్ ఫ్లైట్ టీవీ డీ-1కు నెలకొన్ని సమస్యను గుర్తించి వెంటనే కొద్ది క్షణాల్లో ఇస్రో శాస్త్రవేత్తల బృందం సరి చేసింది. దీంతో ప్రయోగాన్ని మళ్లీ ప్రారంభించారు.
ప్రయోగానికి ముందు ఇది తమకు ఒక పరీక్షలాంటిదని ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాథ్ అన్నారు. సాంకేతిక లోపాన్ని త్వరగా గుర్తించి వెంటనే సరిచేసిన శాస్త్రవేత్తల బృందాన్ని ఇస్రో చైర్మన్ అభినందించారు. అనతంరం 10 గంటలకు ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఈ ప్రయోగం ద్వారా క్రూ ఎస్కేప్ సిస్టమ్(సీఈఎస్) ఉపయోగించి వ్యోమగాములు భూమిపై ల్యాండ్ అయ్యే విధానాన్ని పరీక్షించారు.