ఇజ్రాయెల్ (Israel)-హమాస్ (Hamas) మధ్య సంధి నేపథ్యంలో 13 మంది బందీలను హమాస్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) స్పందించారు. మొదటి బ్యాచ్ బందీలను విడుదల చేయడం కేవలం ఆరంభం మాత్రమేనని తెలిపారు. గాజాలో తాత్కాలిక సంధిని పొడిగించే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు.
ఇజ్రాయెల్, పాలస్తీనియన్ల మధ్య శాంతి కోసం ఓ పరిష్కారాన్ని రూపొందించే పనిని పునరుద్ధరించాల్సిన సమయం ఇదని చెప్పారు.
బందీల విడుదల నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌తో పాటు పాలస్తీనా కూడా సంక్షోభం నుంచి బయటపడేందుకు విస్తృత ప్రయత్నాలు చేయాలని సూచించారు. రెండు రాష్ట్రాల పరిష్కారాన్ని కొనసాగించడానికి తమ నిర్ణయాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందన్నారు. ఇది ఇలా వుంటే ఇటీవల ఇజ్రాయెల్-హమాస్‌ల మధ్య సంధిలో భాగంగా మొదటి బ్యాచ్‌లో 13 మంది బందీలను హమాస్ విడుదల చేసింది.
మొదటి బ్యాచ్ బందీలను రెడ్ క్రాస్ కు హమాస్ అప్పగించింది. బందీలను రెడ్ క్రాస్‌కు చెందిన కాన్వాయ్‌లో గాజా నుంచి ఈజిఫ్టు సరిహద్దులు దాటించారు. బందీలకు ముందుగా వైద్య పరీక్షలు నిర్వహిస్తామని ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. అనంతరం వారిని వారి కుటుంబాలకు అప్పగిస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
మరోవైపు హమాస్ ఇప్పటి వరకు 24 మంది బందీలను విడుదల చేసిందని, ఇజ్రాయెల్ 39 మంది మహిళలు, పిల్లలను విడుదల చేసినట్టు ఖతర్ పేర్కొంది. విడుదలైన వారిలో 13 మంది ఇజ్రాయెల్ పౌరులు ఉన్నారని ఖతర్ విదేశాంగ ప్రతినిధి మాజెద్ అల్ అన్సారీ తెలిపారు. వారిలో కొందరికి ద్వంద్వ సభ్యత్వం ఉందన్నారు. దీంతో పాటు 10 మంది థాయ్ లాండ్, పిలిప్పీన్స్ పౌరులను విడుదల చేసిందన్నారు.