దేశం ఎదుర్కొన్న అత్యంత క్రూరమైన దాడుల్లో ముంబై ఉగ్రదాడి (Mumbai attack) ఒకటని ప్రధాని మోడీ (PM Modi) అన్నారు. దేశంపై అత్యంత హేయమైన ఉగ్రదాడి ఇదే రోజున జరిగిందని ఆయన గుర్తు చేశారు. ఈ ఘటనతో దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడిందన్నారు. అందుకే నవంబర్ 26ను దేశ ప్రజలు మరచిపోలేరని తెలిపారు. ఇప్పుడు ఆ దాడి నుంచి కోలుకున్నామని చెప్పారు.
ప్రస్తుతం ఉగ్రవాదాన్ని భారత్ సమర్థవంతంగా అణచి వేస్తోందని మోడీ తెలిపారు. మన్ కీ బాత్ రేడియో కార్యక్రమం 107వ ఎడిషన్లో ప్రధాని మోడీ మాట్లాడారు. నవంబర్ 26కు మరో ప్రాధాన్యత ఉందని గుర్తు చేశారు. ప్రతి ఏడాది నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించిందని చెప్పారు. రాజ్యాంగ దినోత్సవం సందర్బంగా ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలపారు.
‘స్వచ్ఛ భారత్ అభియాన్’ విజయం స్ఫూర్తిదాయకంగా మారుతున్నట్లే, ‘వోకల్ ఫర్ లోకల్’ విజయం అభివృద్ధి చెందిన, సంపన్న భారతదేశానికి తలుపులు తెరుస్తోందన్నారు. దేశ నిర్మాణంలో ప్రజలు భాగస్వామ్యం అయినప్పుడు దేశ పురోగతిని ఏ శక్తి అడ్డుకోలేదన్నారు. 21వ శతాబ్దపు అతిపెద్ద సవాళ్లలో ‘నీటి భద్రత’ అనేది ముఖ్యమైనదన్నారు. నీటిని సంరక్షించడమంటే జీవితాన్ని రక్షించడమేనన్నారు.
ఇటీవలి పండుగల సందర్భంగా దాదాపు రూ. 4 లక్షల కోట్ల వ్యాపారం జరిగిందన్నారు. ప్రజలు మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించారని చెప్పారు. అదే సమయంలో ఎన్ఆర్ఐలు విదేశాల్లో వివాహాలను నిర్వహించే పద్ధతిని కూడా ఈ సందర్బంగా ఆయన ప్రస్తావించారు. అలాంటి వేడుకలన్నింటినీ భారత్ లోనే నిర్వహించుకోవాలని సూచించారు.