ఇజ్రాయెల్ (Israel)లో చిక్కుకున్న భారతీయుల (Indians)ను స్వదేశానికి తీసుకు వచ్చేందుకు భారత్ చేపట్టిన ఆపరేషన్ అజయ్ (operation Ajay) కొనసాగుతోంది. తాజాగా ఇజ్రాయెల్‌లోని భారతీయులతో కూడిన రెండవ ఛార్టెట్ కాసేపటి క్రితం ఢిల్లీకి చేరుకుంది. ఈ విమానంలో మొత్తం 235 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నట్టు అధికారులు తెలిపారు. అందులో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.
అంతకు ముందు ఇజ్రాయెల్‌లో భారతీయులతో కూడిన రెండవ చార్టెడ్ విమానానికి సంబంధించిన ఫోటోలను భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో షేర్ చేశారు. ఆపరేషన్ అజయ్‌లో భాగంగా 235 మంది భారతీయులతో కూడిన రెండవ విమానం టెల్ అవీవ్ ప్రాంతం నుంచి బయలు దేరినట్టు జై శంకర్ వెల్లడించారు.
ఇజ్రాయెల్ నుంచి భారతీయులతో కూడిన మొదటి ఛార్జెట్ విమానం గురువారం భారత్ కు చేరుకుంది. ఇజ్రాయెల్‌లోని బెన్ గురియాన్ విమానాశ్రయం నుంచి బయలు దేరిన విమానం గురు వారం సాయంత్రం ఢిల్లీ విమానశ్రయంలో దిగింది. మొదటి విమానంలో మొత్తం 212 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. న్యూఢిల్లీలో దిగిన తర్వాత వాళ్లంతా భావోద్వేగానికి గురయ్యారు.
ఇటీవల ఇజ్రాయెల్ పై హమాస్ మిలిటెంట్లు దాడి చేశారు. దీంతో హమాస్ మిలిటెంట్లపై ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ లో యుద్దం నడుస్తోంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ లో చాలా మంది భారతీయులు చిక్కుకు పోయారు. దీంతో వారందరినీ భారత్ కు తీసుకు వచ్చేందుకు ఈ నెల 7న భారత ప్రభుత్వం ఆపరేషన్ అజయ్ చేపట్టింది.