గాజా (Gaza)లో కాల్పుల విరమణ (Cease Fire) చేపట్టాలన్న తీర్మానంపై ఐరాసలో నిర్వ హించిన ఓటింగ్ (Voting) కు భారత్ (India) దూరంగా ఉంది. ఈ నేపథ్యంలో మోడీ సర్కార్ పై విపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. ఇజ్రాయెల్- హమాస్ యుద్దం విషయంలో కేంద్రం స్పష్టమైన వైఖరి అవలంభించక పోవడంపై విపక్షాలకు చెందిన అగ్ర నేతలు కేంద్రంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి.
ఐరాసలో ప్రవేశ పెట్టిన తీర్మానం విషయంలో భారత్ చాలా స్పష్టంగా ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. భారత్ మొదటి నుంచి ఉగ్రదాడులను ఖండిస్తూ వస్తోంది. జోర్డాన్ రూపొందించిన ముసాయిదాలో ఎక్కడా ఇజ్రాయెల్ పై ఉగ్రదాడులను ఖండిస్తున్నట్టు ఆ దేశం పేర్కొనలేదు. కానీ హమాస్ ఉగ్రదాడులను ఖండిస్తూ ఒక పేరాను చేర్చాలంటూ ఆ ముసాయిదాకు కెనడా సూచించిన సవరణ తీర్మానానికి భారత్ అనుకూలంగా ఓటు వేసింది.
ఆ సవరణకు ఆమోదం లభించాలంటే ఐరాస జనరల్ అసెంబ్లీలో మూడింట రెండు వంతుల మోజార్టీ పొందాల్సి వుంటుంది. కానీ ఆ సవరణకు మెజార్టీ సభ్యుల మద్దతు లేకపోవడంతో ఆ సవరణ వీగి పోయింది. ఈ వాస్తవాలు అన్నీ తెలిసీ కూడా విపక్ష నేతలు రాజకీయాల కోసం ఎన్డీఏ సర్కార్ ను టార్గెట్ చేస్తున్నారని రాజకీయ పండితులు చెబుతున్నారు.
గాజాలో కాల్పుల విరమణ విషయంలో మన దేశం ఓటింగ్‌కు దూరంగా ఉండటంతో షాక్ అయ్యానని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ అన్నారు. ఇక తీర్మానంపై ఓటింగ్ కు భారత్ దూరంగా ఉండటం తనకు షాకింగ్ గా ఉందని తెలిపారు. ఓటింగ్ కు దూరంగా ఉండడాన్ని దేశంలో అస్థిరమైన విదేశాంగ విధానంగా ఆయన అభివర్ణించారు.
ఇది ఇలా వుంటే ఓటింగ్ విషయంలో తాము స్పష్టంగా ఉన్నట్టు మోడీ సర్కార్ చెబుతోంది. మొదటి నుంచి ఉగ్రవాదానికి తాము వ్యతిరేకంగా ఉన్నామని పేర్కొంది. ఇజ్రాయెల్ పై ఉగ్రదాడులను తాము ఖండిస్తున్నట్టు ఐరాసలో భారత శాశ్వత ఉప ప్రతినిధి యోజన పటేల్ తెలిపారు. బందీలను భేషరతుగా విడిచి పెట్టాలని కోరారు. ఈ తీర్మానంలో హమాస్ దాడుల ప్రస్తావన లేదని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి స్పష్టమైన సందేశం పంపాల్సిన అవసరం ఉందని భారత్ తెలిపింది. అందుకే ఓటింగ్ కు దూరంగా ఉన్నట్టు వెల్లడించింది.