విపక్ష ఇండియా కూటమిపై ప్రధాని మోడీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని ఇండియా కూటమి నేతలు చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. సనాతన ధర్మ పునాదులను కూల గొట్టాలని విపక్ష కూటమి దుర్మార్గపు ఆలోచనలు చేస్తోందని ఫైర్ అయ్యారు. దేశాన్ని మరో 1000 ఏండ్ల వరకు బానిసత్వంలోకి నెట్టాలని విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.
మధ్యప్రదేశ్ లో ప్రధాని మోడీ ఈ రోజు పర్యటించారు. సాగర్ జిల్లాలోని బినా రిఫైనరీలో రూ. 49000 కోట్లతో నిర్మించనున్న పెట్రో కెమికల్స్ కాంప్లెక్స్ కు శంకు స్థాపన చేశారు. మధ్య ప్రదేశ్ లో నిర్వహించిన ర్యాలీలో ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయ్ నిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు.
స్వామి వివేకానంద, లోక్ మాన్య తిలక్ లాంటి వారికి స్ఫూర్తినిచ్చిన సనాతన ధర్మాన్ని పూర్తిగా తుడిచి పెట్టాలని గమాండియా కూటమి ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఇండియా కూటమి నేతలు ఇప్పుడు సనాతన ధర్మంపై బహిరంగంగా టార్గెట్ చేస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో వాళ్లు మనపై దాడులను మరింత పెంచే అవకాశం ఉందన్నారు.
అందువల్ల సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్న వాళ్లు, దేశాన్ని ప్రేమించే వాళ్లంతా అలర్ట్ గా ఉండాలని ఆయన సూచించారు. అలాంటి నేతలను మనం నిలువరించాలన్నారు. గమాండియా కూటమి నేతలంతా ఇటీవల ముంబైలో సమావేశం అయ్యారన్నారు. ఆ కూటమికి ఎలాంటి సిద్దాంతాలు కానీ నేతలు గానీ లేరన్నారు. వాళ్లకు కేవలం సనాతన ధర్మంపై దాడి చేయాలన్న రహస్య అజెండా ఉందన్నారు.