పార్లమెంట్ (Parliament)లో సస్పెన్షన్ (Suspension) కు గురైన ఎంపీలు ఢిల్లీలో ఆందోళనకు దిగారు. సస్పెన్షన్ను వ్యతిరేకిస్తూ పార్లమెంట్ పాత భవనం నుంచి విజయ్ చౌక్ వరకు ర్యాలీ ( నిర్వహించారు. చేతులో ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్లమెంట్ ఓ పంజరంలా మారిందని తెలిపారు. ప్రజాస్వామ్యం బహిష్కరించబడిందని నినాదాలు చేస్తూ ముందుకు సాగారు.
ఈ సందర్బంగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ…. పార్లమెంట్లో భద్రతా లోపాలపై స్పందించడం లేదంటూ ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలపై ఆయన తీవ్రంగా విరుచుకు పడ్డారు. ఈ విషయం గురించి ప్రతిపక్ష ఎంపీలు ప్రస్తావన తెచ్చినప్పుడల్లా అధికారపక్ష ఎంపీలు ఆటంకాలు కలిగిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు.
పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు భద్రతా ఉల్లంఘన ఘటనపై పార్లమెంట్ వెలుపల ప్రధాని మోడీ, అమిత్ షాలు మాట్లాడటం, లోక్ సభలో దీనిపై వివరణ ఇవ్వకపోవడం సభల ప్రత్యేక హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని వెల్లడించారు. ఇటీవల పార్లమెంట్లో భద్రతా లోపంపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. ఈ నేపథ్యంలో సభలో రచ్చ జరిగింది.
ఉభయ సభలను పలుమార్లు వాయిదా వేసినా పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో విపక్ష ఎంపీలను సభాధిపతులు సస్పెండ్ చేశారు. ఇప్పటి వరకు 143 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. విపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడం ద్వారా ప్రజాస్వామ్య గొంతును ప్రభుత్వం నొక్కుతోందని మండిపడుతున్నాయి. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అని ఫైర్ అవుతున్నాయి.