సంగారెడ్డి జిల్లా(Sangareddy) జిల్లా హత్నూర మండలంలోని ఎస్బీ ఆర్గానిక్ కంపెనీ పేలుడు(SB Organic company Blast) ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. ఇప్పటికే ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం మృతుల సంఖ్య 6కి చేరింది. రియాక్టర్ పేలడంతో అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డ్, కంపెనీలో పనిచేస్తున్న మరో కీలక ఉద్యోగి మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు.
మిగతా నలుగురిలో పరిశ్రమ డైరెక్టర్‌తో పాటు బిహార్‌కు చెందిన కార్మికులు ఉన్నారు. అదే విధంగా ఈ ప్రమాదంతో రూ.100కోట్లకు పైగా ఆస్తినష్టం వాటిల్లినట్లు సమాచారం. చందాపూర్ శివారులో ఉన్న ఎస్బీ ఆర్గానిక్ పరిశ్రమలో బుధవారం ఆయిల్ బాయిలర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పేలుడు ధాటికి బిల్డింగ్స్ ధ్వంసమయ్యాయి. విషయం తెలిసిన వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు.
సంగారెడ్డి ఎస్పీ రూపేశ్, డీఎస్పీ రవీందర్ రెడ్డి, మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు పరిశీలించారు. ప్రమాద సమయంలో 60మంది ఉద్యోగులు డ్యూటీలో ఉండగా వారిలో ఇప్పటి వరకు 30మంది ఉద్యోగుల ఆచూకీ మాత్రమే లభ్యమైంది. మిగతా వారిని గుర్తించేందుకు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. శకలాల కింద మరిన్ని మృతదేహాలు ఉండే అవకాశముందని వాటిని తొలగిస్తే ఎంతమంది మృతిచెందారో స్పష్టత వచ్చే అవకాశముందని పోలీసులు చెబుతున్నారు.
మరోవైపు ఎస్బీఆర్గానిక్స్ కంపెనీ పక్కనే ఉన్న మరో స్టీల్ కంపెనీ పూర్తి స్థాయిలో దగ్ధమైంది. ఆ కంపెనీకీ రూ.50కోట్లకు పైగా ఆస్తినష్టం వాటిల్లినట్లు అంచనా. సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. ఈ ప్రమాదంలో 15మంది వరకు కార్మికులకు తీవ్రగాయాలు కాగా వారిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు మంత్రి కొండా సురేఖ ఇప్పటికే రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు.