ఆస్కార్ విన్నింగ్ మూవీ ( Oscar Winning Movie) ‘స్మైల్ పింకీ’ (Smile Pinky) ఫేమ్ పింకీ సోంకర్ (Pinky sonkar) కు ఫారెస్టు అధికారులు (Forest Officials) నోటీసులు జారీ చేశారు. యూపీలోని మీర్జాపూర్ అటవీ శాఖకు చెందిన స్థలంలో పింకీ ఇళ్లు నిర్మించారని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఇంటిని కూల్చి వేయనున్నట్టు నోటీసుల్లో వెల్లడించారు.
పింకీ జీవితం ఆధారంగా నిర్మించిన స్మైల్ పింకీ చిత్రానికి 2008లో ఆస్కార్ అవార్డు లభించింది. జిల్లాలోని రామ్ పూర్ గ్రామంలో పింకీతో పాటు మరో 30 మంది గ్రామస్తులు అటవీ స్థలాల్లో ఇళ్లు నిర్మించారని అటవీ శాఖ అధికారులు తెలిపారు. దీంతో వాళ్లందరికీ నోటీసులు జారీ చేసినట్టు చెప్పారు. అవన్నీ అక్రమ నిర్మాణాలు కావడంతో వాటిని కూల్చి వేయనున్నట్టు చెప్పారు.
పింకీ తండ్రితో పాటు గ్రామస్తుల వాదన మరోలా వుంది. తాము ఇళ్లు నిర్మిస్తున్న సమయంలో అది అటవీ శాఖకు చెందిన భూములని గ్రామస్తులకు ఎవరూ చెప్పలేదని పింకీ తండ్రి రాజేంద్ర సోంకర్ వెల్లడించారు. పింకీ డాక్యుమెంటరీకి ఆస్కార్ అవార్డు వచ్చిన సందర్భంలో ఆ భూములను తమకు అటవీ శాఖ అధికారులు ఇచ్చారని గ్రామస్తులు చెబుతున్నారు.
అది ఎలాంటి భూమి అనేది గ్రామస్తులకు తెలియదని గ్రామస్తుల తరఫు న్యాయవాది చెప్పారు. పింకీ ఇంటి నిర్మాణానికి శంకు స్థాపన చేసింది అటవీ అధికారులేనని అన్నారు. మళ్లీ ఇప్పుడు వాళ్లే అది అక్రమ నిర్మాణం అంటున్నారని ఆయన తెలిపారు. ఈ నెల 26 లోగా ఆ ఇళ్లను ఖాళీ చేయాలని గ్రామస్తులకు ఈ నెల 21న అధికారులు నోటీసులు పంపినట్టు వెల్లడించారు.