ఆలిండియా కాంగ్రెస్ కమిటీ చీఫ్ (AICC) మల్లిఖార్జున ఖర్గే (Mallikarjuna karge) బీజేపీ నేతలపై సంచలన ఆరోపణలు చేశారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఢిల్లీలో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడుతూ.. దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలంటే నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలని స్పష్టంచేశారు.అన్ని పార్టీలకు లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్ (సమాన స్థాయి అవకాశం) ఉండాలని సూచించారు.
ప్రస్తుతం దేశంలో అధికార బీజేపీ ఇతర పార్టీల పట్ల వ్యవహరిస్తున్న తీరు ఆమోదయోగ్యం కాదన్నారు. ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు మేరకు స్టేట్ బ్యాంక్ ఇండియా విడుదల చేసిన ఎలక్ట్రోరోల్ బాండ్లపై ఆయన మాట్లాడుతూ విచారం వ్యక్తంచేశారు. అధికార పక్షానికి వేల కోట్ల రూపాయలు బాండ్ల ద్వారా వచ్చాయి. మరోవైపు ప్రధాన విపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ ఖాతాలను ఆదాయ పన్ను శాఖ ఫ్రీజ్ చేసింది.
లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లేకుండా చేయడం అధికారపక్షం చేసిన దుష్టపన్నాగం అని వ్యాఖ్యానించారు. ఒక రాజకీయ పార్టీని అసహాయ స్థితిలో పడేస్తే ఇవి నిష్పక్ష,పారదర్శక ఎన్నికలు అని ఎలా చెప్పగలం? అంటూ ప్రశ్నించారు. ‘బీజేపీకి 56 శాతం నిధులు వస్తే, కాంగ్రెస్ పార్టీకి 11 శాతం మాత్రమే వచ్చాయి.ప్రింట్,టీవీ,సోషల్ మీడియాలో అధికార పక్షం డామినేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. ఆ పార్టీకి అన్ని చోట్లా 5-స్టార్ ఆఫీసులు ఉన్నాయి. ఆ పార్టీ నేతలు ప్రత్యేక విమానాల్లో తిరుగుతున్నారు.
బీజేపీ ఒక్కో మీటింగ్ కోసం ఎంత ఖర్చచేస్తున్నదో అందులో ప్రతిపక్షం కనీసం 10 శాతం కూడా ఖర్చు చేయడం లేదు.రాజ్యాంగ సంస్థలను కోరేది ఒక్కటే..ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు కోరుకుంటే మా బ్యాంకు ఖాతాలను వినియోగించుకునేలా చేయండి.ఇన్కం ట్యాక్స్ వివాదం ఏదైనా సరే కోడ్ ముగిసిన తర్వాత ఉండాలి.
ఏ రాజకీయ పార్టీకి ఆదాయపు పన్ను ఉండదు.బీజేపీకి కూడా ఉండదు.కానీ కాంగ్రెస్ మీద మాత్రమే ఆదాయపు పన్ను శాఖ ఎందుకు ఇలా పనిచేస్తోంది.దీనిపై న్యాయస్థానంలో పోరాడుతున్నాం.తుది నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాం’అంటూ ఖర్గే సంచలన కామెంట్స్ చేశారు.