బీజేపీ (BJP) డబుల్ ఇంజన్ సర్కార్ హయాంలో ఇండోర్ సమీపంలో వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని ప్రధాని మోడీ (PM Modi) అన్నారు. దీనివల్ల వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని మోడీ తెలిపారు. మధ్యప్రదేశ్ ఇండోర్ నగరంలో హుకుమ్‌చంద్ మిల్లు కార్మికులకు సంబంధించిన రూ. 224 కోట్ల బకాయిలను ప్రధాని మోడీ విడుదల చేశారు.
ఈ సందర్బంగా ‘మజ్దూరాన్ కా హిట్, మజ్దూరాన్ కో సమర్పిత్’ కార్యక్రమంలో కార్మికులను ఉద్దేశించి ప్రధాని వర్చువల్ గా ప్రసంగించారు. ఈ నిర్ణయంతో 4,800 మందికి పైగా కూలీలకు ప్రయోజనం కలుగుతుందన్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న కార్మికుల సమస్యను పరిష్కరించినందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రధాని అభినందించారు.
ఈ గొప్ప కార్యక్రమంలో తాను కూడా భాగస్వామ్యం కావడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. పేదలు, మహిళలు, రైతులు, యువత అనే నాలుగు కులాలు తమకు చాలా ముఖ్యమైనవని పేర్కొన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి సందర్భంగా సుపరిపాలన దినోత్సవం రోజు కార్మికుల ఆశీర్వాదం పొందడం “డబుల్ ఇంజన్” ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు.
1992లో ఇండోర్‌లోని హుకుమ్ చంద్ మిల్లు మూతపడింది. అప్పటి నుంచి మిల్లు కార్మికులు తమ రావాల్సిన బకాయిల గురించి కార్మికులు పోరాటం చేస్తున్నారు.
మధ్యప్రదేశ్ ప్రభుత్వం చొరవతో, రాష్ట్ర హౌసింగ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బోర్డ్, లేబర్ యూనియన్లు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దాని ప్రకారం సెటిల్మెంట్ మొత్తాన్ని డిసెంబర్ 20న హైకోర్టులో జమ చేసినట్లు అధికారులు తెలిపారు.