ఇజ్రాయెల్ (Israel)-హమాస్ యుద్ధం నేపథ్యంలో గాజా(Gaza) లో విధ్వంసం జరుగుతోంది. ఎటు చూసినా భవన శిథిలాలే కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థ కట్ కావడంతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. తమ ఇబ్బందులను కూడా బయటి ప్రపంచంతో పంచుకులేని పరిస్థితి ఏర్పడింది.
ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ చిన్నా భిన్నమైంది. గాజా స్ట్రిప్‌ను ఇప్పటికే ఇజ్రాయెల్ అష్ట దిగ్బంధం చేసింది. దీంతో తిండి, తాగేందుకు కనీసం గుక్కెడు నీళ్లు కూడా దొరకడం లేదు. ప్రపంచం దేశాలు మానవత సహాయం కింద అందిస్తున్న ఆహారాన్ని తింటూ జీవితాన్ని వెళ్లదీస్తు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నిమిష నిమిషానికి బాంబుల మోతలతో ప్రజలకు కనీసం కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఇప్పటికే చాలా మంది ప్రాణాలు అర చేతుల్లో పట్టుకుని పక్క దేశాలకు వలస వెళ్లి పోతున్నారు. ఇంకా కొంద మంది శరణార్థుల శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. దీంతో వాళ్ల ఇబ్బందులు వర్ణనాతీతంగా ఉన్నాయి.
ఇది ఇలా వుంటే యుద్ధం వల్ల గాజాలో ఇప్పటికే 60 శాతం మంది ఉద్యోగాలు కోల్పోయారని అంతర్జాతీయ కార్మిక సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. పాలస్తీనాలో ఇప్పటి వరకు మొత్తం లక్షా 82 వేల మంది నిరుద్యోగులుగా మారారని ఐఎల్ఓ పేర్కొంది. జీవనోపాధి కోల్పోవడంతో దేశంలో సగం మంది ప్రజలు దుర్బర జీవితం గడుతుపుతున్నారని చెప్పింది.
యుద్ధం వల్ల పాలస్తీనా లేబర్ మార్కెట్ ఆర్థిక సంక్షోభంలో పడిందని ఐఎల్ఓ అరబ్ రాష్ట్రాల ప్రాంతీయ డైరెక్టర్ రుబా జరాదత్ తెలిపారు. ఈ పరిస్థితులు మరికొంత కాలం ఇలాగే కొనసాగితే పరిస్థితులు మరింత తీవ్రంగా మారుతాయని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధానికి ముందు గాజాలో 23 లక్షల మందికిపైగా పేదరిక రేఖకు దిగువనే ఉండేవారని చెప్పారు.