గాజా (Gaza)పై ఇజ్రాయెల్ (Israel) దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా గాజాలో నిరాశ్రయులైన ప్రజలు తలదాచుకుంటున్న ఓ పాఠశాల, ఉత్తర గాజాలోని శరణార్థుల శిబిరంపై ఇజ్రాయెల్ సేనలు దాడులు జరిపాయని హమాస్ ప్రభుత్వం ఆరోపించింది. ఈ జంట దాడుల్లో సుమారు 80 మందికి పైగా మరణించినట్టు హమాస్ వైద్యారోగ్య శాఖ అధికారి ఒకరు వెల్లడించారు.
తాజాగా దీనికి సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రక్తంతో తడిసి ముద్ద అయిన మృత దేహాలు ఆ వీడియోల్లో కనిపిస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో నడిచే అల్-ఫఖురా పాఠశాలపై తెల్లవారుజామున ఇజ్రాయెల్ సైన్యం దాడులు జరిపిందని హమాస్ అధికారి పేర్కొన్నారు.
ఈ దాడుల్లో సుమారు 50 మంది మరణించినట్టు తెలిపారు. మరోవైపు ఉత్తరగాజాలో శరణార్దుల శిబిరంపై జరిగిన దాడుల్లో 30 మంది వరకు మరణించారన్నారు.
అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై హమాస్ మిలిటెంట్ల దాడితో మొదలైన యుద్ధం మొదలైంది. హమాస్ దాడుల్లో తమ దేశానికి చెందిన 1200 మంది పౌరులు మరణించారని, 240 మంది హమాస్ మిలిటెంట్లు బంధించారని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది.
ఈ క్రమంలో హమాస్ మిలిటెంట్లపై ఇజ్రాయెల్ యుద్దం ప్రకటించింది. వెంటనే గాజాపై ఎయిర్ స్ట్రైక్స్ మొదలు పెట్టింది. ఆ తర్వాత గాజాను పూర్తిగా స్వాధీనం చేసుకునేందుకు గ్రౌండ్ ఆపరేషన్ మొదలు పెట్టింది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటి వరకు 12,300 ప్రజలు, సుమారు 5,000 మందికి పైగా పిల్లలు మరణించారని హమాస్ వైద్య శాఖ చెబుతోంది.