దేశవ్యాప్తంగా ఎన్నికల సందడి నెలకొంది. పార్టీలన్నీ గెలుపు కోసం ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా అధికారంలో ఉన్న బీజేపీ దూకుడుగా ఉంది. ఓవైపు ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాల్లో ప్రచారాన్ని కొనసాగిస్తుండగా, ఇంకోవైపు నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి కేంద్ర పథకాలను వివరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్నారైలు బీజేపీకి మద్దతుగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ‘ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ యూకే’ (OFBJPUK) ఆధ్వర్యంలో కవి సమ్మేళనం ఘనంగా జరిగింది. లండన్ (London) లోని స్ట్రాట్ ఫార్డ్ లో ఉన్న రాధా కృష్ణ ఆలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
భారత్ లో జరుగుతున్న బీజేపీ (BJP) ఎన్నికల ప్రచారానికి మద్దతుగా ఈ కార్యక్రమం జరిగింది. ఉత్తరప్రదేశ్, హర్యానా అధ్యాయాలకు సంబంధించి ఇది జరగగా, స్థానికంగా ఉన్న ఎన్నారైలు కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ‘ఓఎఫ్ బీజేపీ యూకే’ అధ్యక్షుడు కుల్దీప్ షెకావత్ ఇండియాలో ఉండడంతో తన సందేశాన్ని పంపించారు. వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఆనంద్ ఆర్య మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వం ఆదర్శవంతంగా సాగిందని తెలిపారు. జనరల్ సెక్రెటరీ సురేష్ మంగళగిరి మాట్లాడుతూ, పదేళ్లలో భారత్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, పరివర్తన పథకాలు మార్పునకు శ్రీకారం చుట్టాయని వివరించారు.
ఈ కవి సమ్మేళనంలో యూకే, ఇండియాకు చెందిన ప్రముఖ హిందీ కవులు పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఆకట్టుకున్నాయి. తేజిందర్ శర్మ అధ్యక్షతన ఇవి జరిగాయి. అలాగే, ఆశిష్ మిశ్రా వ్యాఖ్యాతగా వ్యవహరించగా, చందా జీ, కృనాల్ ఠక్కర్, అంతరా తల్లం, గిరిరాజ్ జోషి, ఇందు బరోట్, అస్తా డియో, అశుతోష్ కుమార్, డాక్టర్ మనోహర్ గోర్, డాక్టర్ జ్ఞాన్ శర్మ, ఆశిష్ మిశ్రా , శశి పటేల్, దర్శన్ గ్రేవాల్, డాక్టర్ దేవేంద్ర చౌహాన్ పాల్గొన్నారు. డాక్టర్ జ్ఞాన్ శర్మ మాట్లాడుతూ, కార్యక్రమానికి హాజరైన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
‘ఓఎఫ్ బీజేపీ యూకే హర్యానా’, ‘ఓఎఫ్ బీజేపీ యూకే ఫర్ యూపీ’ సభ్యులు ఈ ఈవెంట్ విజయవంతం కావడంలో పాలుపంచుకున్నారు. రాజేష్ విశ్వకర్మ, హిర్దేశ్ గుప్తా, డాక్టర్ జ్ఞాన్ శర్మ, ధీరేంద్ర కుమార్, ఆశిష్ మిశ్రా, వైశాలి నాగ్ పాల్, చందా ఝా, అప్రిత్ మెహ్రోత్రా, అలోక్ గుప్తా, పరుల్ పాండే, రష్మీ చౌబే, ఆదర్శ్ మిశ్రా, దేవ్ త్యాగి, ప్రవీణ్ కుమార్ కలిసికట్టుగా కార్యక్రమాన్ని నడిపించారు. భారత్ లో బీజేపీ మూడోసారి విజయం సాధించాలనే లక్ష్యంతో తమ వంతుగా ఈ ఈవెంట్ ను నిర్వహించినట్టు చెప్పారు.