పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ (Navz Shareef) సంచలన వ్యాఖ్యలు (Sensational Remarks) చేశారు. భారత్ (India) ఇప్పుడు జాబిల్లిపై ప్రయోగాలు చేస్తోందన్నారు. జీ-20 సమావేశాలకు భారత్ అధ్యక్షత వహించిందన్నారు. కానీ తమ దేశం మాత్రం అన్ని దేశాల చుట్టూ తిరుగుతూ డాలర్ల కోసం అడుక్కుంటోందని ఆయన తీవ్రంగా మండిపడ్డారు.
పాక్ లో ప్రస్తుత పరిస్థితులకు ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ ఖామర్ జావెద్ బజ్వా, మాజీ స్పై మాస్టర్ ఫైజ్ హమీద్ కారణమని ఆరోపించారు. భారత్ లో జరుగుతున్న ఆర్థికాభివృద్ధిని షరీఫ్ కొనియాడారు. భారత్ అభివృద్ధిని ప్రస్తావిస్తూ తమ దేశంలో పరిస్థితులపై మండిపడ్డారు. భారత్ ఆర్థిక సంస్కరణలను కొనసాగించిందన్నారు.
భారత్ సాధించిన అద్భుత విజయాలను పాక్ ఎందుకు అందుకో లేకపోయిందని ప్రశ్నించారు. అటల్ బిహారీ వాజ్ పాయ్ ప్రధానిగా వున్న సమయంలో భారత ఖజనాలో కొన్ని బిలియన్ల విదేశీ మారక ద్రవ్యం మాత్రమే వుండేదన్నారు. కానీ ఇప్పుడు భారత విదేశీ మారక ద్రవ్యం 600 బిలియన్ డాలర్లకు చేరుకుందన్నారు.
ఇప్పుడు భారత్ ఏ స్థానంలో వుంది, పాక్ ఎక్కడ ఉందన్న విషయం ఆలోచించుకోవాలన్నారు. పాక్ లో పరిస్థితి భిన్నంగా వుందన్నారు. డాలర్ల కోసం చిప్ప పట్టుకుని అరబ్, చైనాల చుట్టూ పాక్ ప్రధాని తిరగాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. అప్పులు కట్టలేక దివాళా తీసే స్థాయికి పాక్ చేరుకోవడం విచారకరమన్నారు. ఈ పరిస్థితికి ఎవరు కారణమో ఆలోచించాలన్నారు.