లోక్ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (POK)మనదేనని తెలిపారు. జమ్ము కశ్మీర్‌లో పీఓకేకు కూడా ప్రత్యేక స్థానాలు కేటాయించామని తెలిపారు. పీఓకేకు 24 స్థానాలు కేటాయించినట్టు చెప్పారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి వలస వచ్చిన వారి కోసం జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో ఒక స్థానం కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు.
రెండు ‘నయా కశ్మీర్’ బిల్లులను కేంద్రం లోక్ సభలో ప్రవేశ పెట్టింది. ఈ సందర్బంగా అమిత్ షా మాట్లాడుతూ… గత 70 ఏండ్లుగా జమ్ము కశ్మీర్‌లో హక్కులు కోల్పోయిన కశ్మీరి పండిట్లకు ఈ బిల్లులు పూర్తిగా న్యాయం చేస్తాయన్నారు. ఈ రిజర్వేషన్లు చట్టసభలో వారి గొంతును వినిపించేలా చేస్తాయన్నారు.
మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ చేసిన రెండు తప్పిదాల వల్ల జమ్మూ కాశ్మీర్ నష్టపోయిందని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మొదట కాల్పుల విరమణ ప్రకటించి, ఆపై కాశ్మీర్ సమస్యను ఐక్యరాజ్యసమితికి తీసుకువెళ్లడం వల్ల ప్రజలు ఇబ్బంది పడ్డారన్నారు. మన బలగాలు విజయం సాధించే సమయంలో నెహ్రూ కాల్పుల విరమణ ప్రకటించారన్నారు.
అప్పుడే పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK)ఉనికిలోకి వచ్చిందన్నారు. అది అతిపెద్ద తప్పిదమన్నారు. కాల్పుల విరమణ మూడు రోజులు ఆలసమై ఉంటే పీఓకే భారత్ లో భాగంగా ఉండేదన్నారు. కశ్మీర్‌లో గతంలో 46 సీట్లు ఉండగా వాటిని 47కు పెంచామన్నారు. జమ్ములో గతంలో 37 సీట్లు ఉండగా ఇప్పుడు 43కు పెంచామన్నారు.