పార్లమెంట్ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ (Central Defence Minister Rajnath singh) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. సోమవారం హోలీ(HOLI) పండుగ సందర్భంగా ఆయన లద్దాక్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా లేహ్‌లోని సైనిక స్థావరంలోని భద్రతా బలగాలతో ఆయన హోలీ పండుగను జరుపుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే పీవోకే (పాక్ ఆక్రమిత కశ్మీర్)(POK) భారత్ లో విలీనం అవుతుందని జోస్యం చెప్పారు. పాక్ ఆక్రమిత్ కశ్మీర్ లోని ప్రజలు తాము భారత్‌తో కలిసి ఉంటామని విజ్ఞప్తి చేస్తున్నారని వివరించారు. దీనికి సంబంధించి ఇప్పటికే చాలా డిమాండ్లు వచ్చాయన్నారు.
ప్రస్తుతం అక్కడ (పీవోకే)లో పరిస్థితులు మారుతున్నాయని, భారత్‌లో పీవోకే విలీనం అవుతుందనే విశ్వాసం తనకు 100 శాతం ఉందని ఆశాభావం వక్తంచేశారు. ఢిల్లీ అనేది దేశరాజధాని, ముంబై అనేది దేశ ఆర్థిక రాజధాని అయితే, లద్దాక్ అనేది మన దేశ శౌర్యానికి రాజధాని అని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టంచేశారు.
ఇదిలాఉండగా, రక్షణ మంత్రి చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరోసారి పీవోకే సెంటిమెంట్ పేరుతో రాజకీయాల్లో లబ్ది పొందాలని చూస్తోందని, ఇటువంటి మాయమాటలను ప్రజలు నమ్మి మోసపోవద్దని ప్రతిపక్షాలు తెలిపాయి.