సాధారణ జీవనం, ఉన్నత ఆలోచనలు, దృఢ సంకల్పం కలిగిన వ్యక్తి పండిట్ దీన్ దయాళ్ (Pandit Deendayal Upadhyay). ఆయన ఒక మంచి రచయిత, ఉత్తమ పాత్రికేయుడు, గొప్ప తాత్వికుడు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ తర్వాత జన సంఘ్ భాద్యతలు చేపట్టి పార్టీని విజయపథంలో నడిపించారు. ఏకత్మాత మానవతా వాదంతో జనసంఘ్( Jan Sangh)కు సిద్దాంతపరమైన బాటలు వేసిన గొప్ప వ్యక్తి ఆయన.
25 సెప్టెంబర్ 1916లో ఉత్తర ప్రదేశ్ మధురలో ‘నగ్ల చంద్రభాన్’ అనే గ్రామంలో దీన్ దయాళ్ జన్మించారు. 1937లో డిగ్రీ చదువుతున్న సమయంలో ఆర్ఎస్ఎస్‌లో చేరారు. ఐదేండ్ల తర్వాత ప్రచారక్ అయ్యారు. అనంతరం 1952లో భారతీయ జన సంఘ్ పార్టీలో చేరారు. ఇది ఆయన జీవితంలో కీలక ఘట్టం.
ఆ తర్వాత జనసంఘ్ ప్రధాన కార్యదర్శిగా భాద్యతలు చేపట్టారు. 1967లో జన సంఘ్ కు అధ్యక్షుడయ్యారు. మన జాతీయ విలువలు. సాంస్కృతిక, నాగరికతల ఆధారంగా స్వదేశీ ఆర్థిక విధానాలను అవలంబించాల్సిన అవసరం గురించి ఆయన చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థకు ఏకత్మ మానవవాదం అనుకూలమైనదన్నారు.
1951 అక్టోబరు 21న జనసంఘ్ పార్టీని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఏర్పాటు చేశారు. పార్టీ స్థాపించిన మూడు నెలల్లోనే జాతీయ పార్టీగా గుర్తింపు పొందింది. అందులో దీన్ దయాళ్ పాత్ర చాలా కీలకమైంది. ముఖ్యంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ మరణం తర్వాత జన సంఘ్ కనుమరుగవుతుందని అంతా భావించారు. కానీ తన కౌశలంతో పార్టీని పటిష్ట స్థితికి తీసుకు వచ్చి అందరి అంచనాలను తలకిందులు చేసిన వ్యక్తి దీన్ దయాళ్.