పార్లమెంట్ స్మోక్ ఘటన (Parliament Smoke Attack)లో ఢిల్లీ పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి లలిత్ ఝా (Lalit Jha)తో పాటు ఇతర నిందితులు తమ డిమాండ్లను నేరవేర్చేలా ప్రభుత్వాన్ని బలవంతం చేసేందుకు దేశంలో అరాచకాన్ని సృష్టించాలని అనుకున్నారని న్యాయస్థానంలో వెల్లడించారు. ఈ కేసులో సీన్ రీ కన్ స్ట్రక్షన్ కోసం పార్లమెంట్ అనుమతి కోరే యోచనలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
పార్లమెంట్‌లో స్మోక్ ఎటాక్ కు ప్లాన్ చేసేందుకు ఈ కేసులోని ఇతర నిందితులను తాను చాలాసార్లు కలిశానని ఝా అంగీకరించినట్లు ఢిల్లీ పోలీసులు పాటియాలా హౌస్ కోర్టుకు తెలిపారు. ఢిల్లీ-జైపూర్ సరిహద్దుల్లో తమ ఫోన్లను విసిరివేసినట్టు విచారణ సమయంలో ఝా వెల్లడించినట్టు తెలిపారు. మిగతా నిందితుల ఫోన్లను ధ్వంసం చేసినట్టు చెప్పాడన్నారు.
ఈ ఘటన వెనుక నిరుద్యోగమే కారణమని ఝా చెబుతున్నాడని పోలీసులు వెల్లడించారు. కానీ దీని వెనుక పెద్ద కుట్ర ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. విదేశీ శక్తుల పాత్ర ఉన్నట్టు అనుమానిస్తున్నట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు స్మోక్ క్యాన్లను దాచేందుకు ప్రత్యేకమైన షూలను నిందితులు వాడినట్టు పోలీసుల విచారణలో తెలుస్తోంది.
ఆ షూలను డిజైన్ చేసిన వ్యక్తి ఎవరనే విషయంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక నిందితులు తమ ప్లాన్ ఏ ఫెయిల్ అయితే వెంటనే ప్లాన్ బీ అమలు చేయాలని భావించారని చెబుతున్నారు. ఆ ప్లాన్ గురించి కూడా దర్యాప్తు జరుగుతోందన్నారు. నిందితుల చేతిలో కర పత్రాల గురించి కూడా పోలీసులు ఆరాతీస్తున్నారు.