పార్లమెంట్లో భద్రత లోపం (Parliament Security Breach) ఘటనలో ఇప్పటి వరకు నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులపై ఐపీసీ సెక్షన్లతో పాటు చట్ట విరుద్ద కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA)కింద కేసులు నమోదు చేశారు. నిందితులను ఈ రోజు న్యాయస్థానం ఎదుట హాజరు పర్చనున్నారు. నిందితుల్లో సాగర్ శర్మ, మనోరంజన్ లోక్ సభలోకి దూసుకు వెళ్లి పసుపు రంగు పొగను వెదజల్లే వస్తువును విసిరారు.
మరో నిందితుడు అమోల్ షిండేతో కలిసి నిందితురాలు నీలమ్ దేవీ పార్లమెంట్ ఆవరణలో ఎరుపు, పసుపు రంగు టియర్ గ్యాస్ బాటిల్స్ విసిరినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. నిందితులు స్మోక్ ను స్పే చేస్తు వుండగా గురుగావ్ కు చెందిన లలిత్ ఝా, వికీ శర్మలు వీడియో తీశారు. అనంతరం లలిత్ ఝా అక్కడి నుంచి పరారీ కాగా వికీ శర్మను పోలీసులు పట్టుకున్నారు.
నిందితులకు వికీ శర్మ దంపతులు ఆశ్రయం కల్పించినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. నిందితులంతా సోషల్ మీడియాలో ‘భగత్ సింగ్ ఫ్యాన్ క్లబ్’అనే గ్రూపునకు చెందిన సభ్యులుగా ఢిల్లీ పోలసులు గుర్తించారు. ఏడాదిన్నర క్రితం వారంతా మొదటి సారిగా మైసూరులో కలుసుకున్నారు. అప్పుడే మొదటి సారిగా దాడి గురించి ప్రణాళికలు రూపొందించారని తెలిపారు.
ఆ తర్వాత తొమ్మిది నెలల ముందు మరోసారి సమావేశమై ప్రణాళికను ఎలా అమలు చేయాలనే విషయం చర్చించారని వెల్లడించారు. ఈ ఏడాది జూలైలో సాగర్ శర్మ లక్నో నుంచి ఢిల్లీకి వచ్చాడని పోలీసు వర్గాలు తెలిపాయి. కానీ ఆ సమయంలో అతనికి పార్లమెంట్ లోకి ప్రవేశించే అవకాశం దొరకలేదని చెప్పాయి. దీంతో రెక్కీ నిర్వహించి సెక్యూరిటీ చెక్ పాయింట్స్ గురించి పూర్తి వివరాలను నిందితుడు సేకరించాడన్నాయి.
నిందితుడు ఈ ఆదివారం గురుగావ్ లోని వికీ ఇంటికి చేరుకున్నాడని పేర్కొన్నాయి. నిందితుడు అమోల్ షిండే మహారాష్ట్ర నుంచి స్మోక్ బాంబులను తీసుకు వచ్చినట్టు వివరించాయి. ఇండియా గేట్ వద్ద వాటిని మిగితా నిందితులకు పంపిని చేశాడని చెప్పాయి. మొత్తం ఆరుగురు నిందితులు లోపలికి వెళ్లాలని అనుకున్నప్పటికీ కేవలం ఇద్దరికి మాత్రమే పాసులు జారీ అయ్యాయన్నారు. దీంతో ఇద్దరు నిందితులు మాత్రమే పార్లమెంట్ లోపలికి వెళ్లారని తెలిపాయి.