పార్లమెంట్లో భద్రతా లోపం (Parliament Security Breach) ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్పందించారు. ఈ ఘటనకు కారణం నిరుద్యోగమే కారణమని తెలిపారు. ప్రధాని మోడీ అనుసరిస్తున్న విధానాల వల్లే దేశంలోని యువకులకు ఉపాధి లభించడం లేదని ఆరోపించారు. నిరుద్యోగం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు.
భారతీయ జనాభా ప్రస్తుతం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య నిరుద్యోగమని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. పార్లమెంట్లో భద్రతా లోపం తలెత్తిందనే మాట పూర్తిగా వాస్తవమని వెల్లడించారు. కానీ ఈ ఘటన ఎందుకు జరిగిందనేదే ఇప్పుడు విషయమని అన్నారు. ఇక్కడ ప్రధాన అంశం నిరుద్యోగమని ఆయన చెప్పారు.
ప్రధాని మోడీ అనుసరిస్తు విధానాల వల్లే ఈ దేశ ప్రజలకు ఉపాధి లభించడం లేదని మండిపడ్డారు. మోడీ విధానాల వల్ల ఏర్పడిన నిరుద్యోగం, ద్రవ్యోల్బణాలే పార్లమెంట్ లో భద్రతా ఉల్లంఘనకు కారణమన్నారు. మరోవైపు కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రంగా విరుచుకు పడ్డారు.
అమిత్ షా కేవలం మీడియాతో మాత్రమే మాట్లాడుతారని, ఈ ఘటనపై పార్లమెంట్లో అమిత్ షా ఎలాంటి ప్రకటన చేయరని ఫైర్ అయ్యారు. ఇది ఇలా వుంటే ఈ ఘటనకు సంబంధించి నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. ఈ కేసులో సీన్ రీ కన్ స్ట్రక్షన్ చే్యాలని పోలీసులు భావిస్తున్నారు.