పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన ( Parliament Security Breach) ఘటనపై లోక్ సభలో రచ్చ జరిగింది. ఈ ఘటనపై సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) సమాధానం ఇవ్వాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. సభలో గందర గోళం నెల కొనడంతో సభా కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడింది. దీంతో సభను స్పీకర్ పలు మార్లు వాయిదా వేశారు.
లోక్‌సభను పలుమార్లు వాయిదా వేసినప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు కన్పించలేదు. లోక్‌సభలో నినాదాలు చేస్తూ సభా కార్యకలాపాలను అడ్డు పడుతున్నారంటూ ఐదుగురు కాంగ్రెస్ ఎంపీలపై సస్పెన్షన్ తీర్మానాన్ని మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రవేశ పెట్టారు. దీంతో ఈ క్రమంలో 14 మంది ఎంపీలను స్పీకర్ సస్పెండ్ చేశారు. ఎంపీలను ఈ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. ఉదయం 11గంటలకు సభ మొదలు కాగానే పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యంపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. ఈ మేరకు వాయిదా తీర్మానం కోసం విపక్షాలు స్పీకర్ కు నోటీసులు అందజేశారు. వెల్‌లోకి దూసుకు వెళ్లి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రశ్నోత్తరాలను ఎంపీలు అడ్డుకున్నారు.
విపక్ష సభ్యులు శాంతించాలని, సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని చైర్మన్ కోరారు. కానీ దానికి టీఎంసీ ఎంపీ డరెక్ ఓబ్రెయిన్ తిరస్కరించారు. దీంతో డెరెక్‌పై చైర్మన్ ధన్ ఖడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన్ని సభ నుంచి సస్పెండ్ చేశారు. అనంతరం పార్లమెంట్ వెలుపల సైతం అధికార విపక్షాల మధ్య యుద్దం నడిచింది.
భద్రతా ఉల్లంఘన ఘటనకు కాంగ్రెస్, వామపక్షాలక సంబంధం ఉందంటూ బీజేపీ ఆరోపణలు గుప్పించింది. మరోవైపు నిందితులకు పాస్ లు జారీ చేసిన బీజేపీ ఎంపీపై చర్యలకు కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ ఘటనపై కేంద్ర హోం మంత్రి స్పందించాలని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ట్వీట్ చేశారు.
పార్లమెంట్ ఘటనపై కేంద్ర మంత్రులతో ప్రధాని ఉన్నత స్థాయి సమావేశం నిర్వ హించారు. సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇతర మంత్రులు పాల్గొన్నారు. మరోవైపు ఈ కేసులో ఆరవ నిందితుని కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. త్వరలోనె పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.