లోక్‌సభ (Lok Sabha)లో ఆగంతకులు కలకలం రేపిన ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనలో మొత్తం ఆరుగురికి సంబంధం ఉన్నట్టు పోలీసులు తెలిపారు. నాలుగేండ్ల క్రితమే వారి మధ్యం స్నేహం ఏర్పడిందన్నారు. పక్కా ప్రణాళికతో రెక్కీ నిర్వహించి నిందితులు దాడి (Attack) చేశారని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఐదుగురిని అరెస్టు చేశామని వెల్లడించారు. మరో నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు.
నిందితులంతా హర్యానాలోని గురుగ్రామ్‌లో ఓ ఇంట్లో కలిసి ఉన్నారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. మొదట ఆరుగురు నిందితులు సభలోకి ప్రవేశించాలని అనుకున్నారు. కానీ ఇద్దరికి మాత్రమే విజిటర్ పాసులు దొరకడంతో ఇద్దరు మాత్రమే సభలోపలికి వచ్చారని తెలిపాయి. నిందితుల మొబైల్ ఫోన్లు దొరికితే మరింత కీలక సమాచారం దొరుకుంతుందని అంటున్నాయి.
మరోవైపు మరిన్ని ఆధారాల కోసం నిందితుల స్వస్థలం కర్ణాటకకు ఇంటెలిజెన్స్ బృందాలు వెళ్లాయి. అక్కడ స్థానిక పోలీసులతో కలిసి నిందితుల ఇంటికి వెళ్లారు. ఉగ్రసంస్థలతో నిందితులకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో వాళ్ల కుటుంబ సభ్యులను ప్రశ్నించినట్టు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. అటు ఫోరెన్సిక్ బృందం కూడా తనదైన శైలిలో దర్యాప్తు జరుపుతోంది.
ఈ ఘటనపై నిందితుడు మనోరంజ్ తండ్రి దేవరాజె గౌడ స్పందించారు. తన కుమారుడు చాలా నిజాయితీ పరుడన్నారు. తన కొడుకు ఇంజనీరింగ్ పూర్తి చేసి ఢిల్లీ, బెంగళూరులో పని చేశాడన్నారు. ఇప్పుడు పొలం పనులు చేసుకుంటున్నాడన్నారు. ఎప్పుడు సమాజానికి సేవ చేయాలని పరితపిస్తూ ఉంటాడన్నారు. ఈ ఘటనలో తన కొడుకు పాత్ర ఉందని తెలిస్తే ఉరితీయాలని చెప్పారు. పార్లమెంట్‌పై జరిగిన దాడిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు.
ఇక ఈ ఘటనపై మహిళా నిందితురాలు నీలమ్ సోదరుడు కూడా స్పందించారు. తన సోదరి ఎంఏ, ఎంఈడీ పూర్తి చేశారని తెలిపారు. ఇప్పుడు నెట్ కు కూడా అర్హత సాధించిందన్నారు. గతంలో రైతు నిరసనల్లో పాల్గొందన్నారు. ఆమె ఢిల్లీకి వెళ్లిన విషయం తనకు తెలియదన్నారు. కేవలం హర్యానాలో హిసార్ లో చదువుకుంటున్నట్టు మాత్రమే తెలుసన్నారు.
నిందితులిద్దరూ విజిటర్స్ గ్యాలరీలో మొదట కాసేపు నిశ్శబ్దంగా ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆ తర్వాత ఒక్కసారిగా అంతా చూస్తుండగానే లోక్ సభ ఛాంబర్ లోకి దూకారని అన్నారు. వెంటనే వారిని పట్టుకునేందుకు ఎంపీలు ప్రయత్నించగా టియర్ గ్యాస్ డబ్బాను నిందితులు విసిరినట్టు చెప్పారు. ఇది ఇలా వుంటే నిందితుడు మనోరంజన్ తరుచుగా బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా కార్యాలయానికి వెళ్లే వారని తెలుస్తోంది.
విజిటర్ పాస్ ఇప్పించాలంటూ ఎంపీని నిందితుడు కోరుతున్నాడని సమాచారం. ఈ క్రమంలో నిందితుడు మనోరంజన్, మరో నిందితుడు సాగర్ శర్మకు ఎంపీ కార్యాలయం నుంచి పాస్‌లు జారీ అయినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. మరో మహిళకు కూడా పాస్ ఇచ్చారని, కానీ ఆమెకు ఘటనతో సంబంధం లేదన్నాయి. విజిటర్స్ పాస్ జారీచేసిన ఎంపీపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.