పార్లమెంట్‌లో అలజడి (Parliament Security Breach) ఘటనకు సంబంధించి మరో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను మహేశ్ (Mahesh), కైలాశ్ లుగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి లలిత్ ఝా పోలీసులకు లొంగిపోయిన కొద్ది సేపటికే ఆ ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. లలిత్ ఝా (Lalit Jhah)తో పాటు నిందితుడు మహేశ్ కూడా లొంగిపోయినట్టు పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
నిందితులను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులకు అప్పగించినట్టు వెల్లడించారు. లలిత్ ఝాను ఇప్పటికే అరెస్టు చేశామని వెల్లడించారు. మహేశ్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు వివరించారు. విచారణ సమయంలో కైలాశ్ అనే నిందితుని పేరు ప్రస్తావనకు వచ్చినట్టు చెప్పారు. దీంతో కైలాశ్ ను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు.
పార్లమెంట్‌లో స్మోక్ అటాక్ ఘటన అనంతరం లలిత్ రాజస్థాన్ కు పారిపోయారన్నారు. పార్లమెంట్ లో అలజడి సమయంలో వాడిన మొబైల్స్ ను రాజస్థాన్ లో ధ్వంసం చేశాడన్నారు. ఆ తర్వాత ఢిల్లీకి వచ్చి లొంగిపోయాడన్నారు. రాజస్థాన్‌లో మహేశ్ అనే వ్యక్తితో కలిసి ఉన్నానని లలిత్ చెబుతున్నాడని, ఆ విషయంపై కూడా దర్యాప్తు జరుపుతున్నామన్నారు.
మహేశ్ కూడా భగత్ సింగ్ ఫ్యాన్ క్లబ్ గ్రూపు సభ్యుడని తెలుస్తోంది. మొదట పార్లమెంట్ వద్ద నిరసనలో పాల్గొనాలని అనుకున్నాడని, కానీ అందులో పాల్గొనలేకపోయాడన్నారు. మరోవైపు ఈ కేసులో సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేసేందుకు పోలీసులు రెడీ అవుతున్నట్టు సమాచారం. నిందితులను పార్లమెంట్ కు తీసుకు వెళ్లి దాడి ఎలా చేశారనే విషయాలను తెలుసుకుంటారని తెలుస్తోంది. దీంతో భద్రతా లోపాలను గుర్తించేందుకు అవకాశం కలుగుతుందని పోలీసులు భావిస్తున్నట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి.